
సాక్షి ప్రతినిధి, చెన్నై/సాక్షి, బెంగళూరు: తమిళనాడులో గురువారం జరిగిన వాహనాల తనిఖీల్లో భారీ ఎత్తున బంగారం, నగదు పట్టుబడింది. సేలం జిల్లా ఏర్కాడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మేట్టుపట్టిలో టెంపో వ్యాన్‌ను అధికారులు సోదా చేశారు. అందులో 100 కిలోల బంగారు నగలు ఉన్నట్టు గుర్తించారు. చెన్నై నుంచి సేలంలోని ఒక ప్రముఖ బంగారు నగల దుకాణానికి సరఫరా చేసేందుకు తీసుకెళుతున్నామని వాహనంలో ఉన్నవాళ్లు చెప్పారు. అయితే ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో బంగారు నగలను, వ్యాన్‌ను జిల్లా కలెక్టర్ స్వాధీనం చేసుకున్నారు. తిరువణ్ణామలై జిల్లా అరూరులో ప్రభుత్వ బస్సులో రహస్యంగా తరలిస్తున్న రూ.3.5 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులు ఆ నగదు ఎవరిదో తమకు తెలియదనడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు.
టోల్ ప్లాజాలో మరో రూ.1.75 కోట్లు స్వాధీనం
అనంతపురం నుంచి బెంగళూరు వెళ్లే జాతీయ రహదారిపై బాగేపల్లి టోల్‌ప్లాజా వద్ద రూ.1.75 కోట్ల నగదు పట్టుబడింది. టోల్‌ప్లాజా యజమాని సుబ్బారెడ్డి కార్యాలయంలో ఎన్నికల అధికారులు, పోలీసులు సోదాలు చేశారు. దీంతో రూ.1.75 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల కోసం నగదును సేకరించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.ఈ నగదు టోల్‌ప్లాజాకు సంబంధించినదని సుబ్బారెడ్డి చెబుతున్నారు. అయితే ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల అధికారి నటరాజ్ ఐటీ అధికారుల సమక్షంలో నగదును సీజ్ చేశారు.