
07–03–2018, బుధవారం
సంతరావూరు, ప్రకాశం జిల్లా
ఈ పాలకులకు కనీస మానవత్వం లేకపోవడం దౌర్భాగ్యం
స్వశక్తితో ఎదిగి అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పతకం సాధించి, ప్రభుత్వ ప్రోత్సాహం కోసం ఎదురుచూసి.. నిరాశ చెందిన గ్రామీణ నిరుపేద కుటుంబానికి చెందిన సురేష్ అనే సోదరుడు కలిశాడు. తాను సాధించిన పతకాలు చూపించాడు. దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి 2016లో వియత్నాంలో జరిగిన ఏíషియన్ బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాడట. వారి టీం రజత పతకం సాధించిందట. ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తుందేమోనని గంపెడాశతో ఎదురు చూశాడట.
ఇతర రాష్ట్రాలకు చెందిన తమ టీం సభ్యులకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగావకాశాలు, ఇతర ప్రోత్సాహకాలు ఇచ్చాయట. తనకు మాత్రం నిరాశే మిగిలిందని, తన తండ్రితో పాటు కూలికి వెళ్లడమే శరణ్యమని వాపోయాడు. ఈ ప్రభుత్వానికి గ్రామీణ క్రీడాకారులంటే ఎంత చిన్నచూపు! పబ్లిసిటీకి పనికొచ్చే విషయాల్లో ఉరుకులు పరుగుల మీద స్పందించే బాబుగారు.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలను ప్రోత్సహించడం వల్ల నాకేం వస్తుంది.. అని అనుకున్నాడో ఏమో! నందిగుంటపాలెం గ్రామంలో 90 ఏళ్లు పైబడిన కందుల సుగుణమ్మ అనే అవ్వ తన మనవడితో మాట్లాడినట్టు చేతిలో చెయ్యేసి బాధలు చెప్పుకొంది. 40 ఏళ్ల నుంచి చౌక డిపోకు పోయి కోటా బియ్యం తెచ్చుకునేదట.
కానీ ఇప్పుడు నాలుగు నెలల నుంచి బియ్యం ఇవ్వడంలేదని బావురుమంది. ఇదేం అన్యాయమయ్యా అని అడిగితే.. నీ వేలిముద్రలు పడటంలేదు పొమ్మంటున్నారని చెప్పింది. పక్క ఊర్లో ఉన్న రేషన్ షాపునకు నెలకు ఐదారు సార్లు తిరిగినా కనికరించడంలేదట. ఈ వయసులో నాకు ఎన్ని తిప్పలయ్యా.. వేలి ముద్రలు లేవని బియ్యం ఆపేస్తే బువ్వ ఎలా తినాలయ్యా.. అంటూ దీనంగా ప్రశ్నించింది. ఆ అవ్వ బాధ చూసి జాలేసింది. ఈ ప్రభుత్వం పేదలు, వృద్ధుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అరచేతిలో చూపించే చంద్రబాబు సర్కారు.. వేలిముద్రలు పడకపోతే సరిచేయలేదా? నిజంగా ఇచ్చే ఉద్దేశమే ఉంటే వీడియో రికార్డింగ్ ద్వారా ఇవ్వొచ్చు. లేదా భౌతికంగా వేలిముద్రలు తీసుకోవచ్చు. రేషన్ బియ్యానికి కోత పెట్టాలన్న చంద్రబాబు కుయుక్తుల ఫలితమే.. ఆ అవ్వకు ఈ రోజు వచ్చిన కష్టం.
ఆదిపూడికి చెందిన దళిత బిడ్డ నాగరాజు ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తిచేశాడట. ‘అన్నా.. చదువు పూర్తయి నాలుగేళ్లయింది. ఉద్యోగావకాశాల్లేవు, నిరుద్యోగ భృతీ లేదు. కుటుంబ పోషణ భారమై గత్యంతరం లేక భవన నిర్మాణ పనులకు కూలీగా పోతున్నాను. ఆ కూలి డబ్బులతో అమ్మను, తాతను, అవ్వను పోషించుకుంటున్నాను’అని బాధపడ్డాడు. ‘అన్నా.. వేలకు వేలు అప్పుచేసి ఏపీపీఎస్సీ కోసం కోచింగ్ తీసుకుంటే.. ఆ పరీక్షలే పెట్టడం లేదు. అప్పులే మిగిలాయి. ఈ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. అదంతా ఒట్టి బూటకమన్నా.. అది మాలాంటి నిరుద్యోగులను మోసం చేయడానికే తప్ప.. ఆ క్యాలెండర్‌లో పేర్కొన్న విధంగా ఒక్క నోటిఫికేషనూ ఇవ్వలేదు. ఒక్క పరీక్షా పెట్టలేదు’అంటూ వాపోయాడు.
పోనీ, ఎస్సీ కార్పొరేషన్‌లో లోన్ తీసుకుని ఏదైనా ఉపాధి చూసుకుందామనుకుంటే.. జన్మభూమి కమిటీలు సైంధవుల్లా అడ్డుపడుతున్నాయట. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్‌ల ఇయర్ క్యాలెండర్ విడుదల చేసి, దానిని అమలు చేయకపోవడం మరింత దారుణం. నిరుద్యోగ యువత ఆ క్యాలెండర్‌ను నమ్ముకుని నోటిఫికేషన్‌లు వస్తాయని ఆశగా ఎదురుచూస్తూ, ఆ పరీక్షలకు కోచింగ్‌లు తీసుకుని ప్రిపేర్ అవుతూ.. సమయానికి పరీక్షలు జరపకపోవడం వల్ల అన్ని రకాలుగా నష్టపోతోంది. నిరుద్యోగ యువతను అన్ని విధాలుగా వంచిస్తున్న ఈ పాలకులకు కనీస మానవత్వం లేకపోవడం దౌర్భాగ్యం. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. సాంకేతిక పరిజ్ఞానం అనేది ప్రజలకు ఉపయుక్తంగా ఉండాలే తప్ప.. సాంకేతికత సాకుతో పేదలకు చెందాల్సిన సంక్షేమ పథకాల్లో కోత పెట్టడం ఎంతవరకు సమంజసం?
Comments
Please login to add a commentAdd a comment