
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)లో 33 లక్షల మంది సభ్యులుంటే, కేవలం 19 లక్షల మందికి మాత్రమే ఓటు హక్కు లభించింది. మిగిలిన వారంతా ఓటు వేయడానికి, పోటీ చేయడానికి అర్హత కోల్పోయారు. ఈ విషయాన్ని సహకారశాఖ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయం, అనుబంధ రంగాల కోసం తీసుకున్న అప్పులను సకాలంలో తిరిగి వాయిదాలు చెల్లించకపోవడంతో ఆయా సహకార సంఘాల్లోని రైతులు అనేకమంది ఓడీ (ఓవర్ డ్యూ) జాబితాల్లో చేరారు. తీరా రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా (ప్యాక్స్) లకు ఎన్నికలు ప్రకటించడంతో ఓడీలో ఉన్న వారంతా ఓట్లున్నా అనర్హుల జాబితాల్లోకి ఎక్కారు. దీంతో గ్రామాల్లో అలజడి నెలకొంది.
చాలా మంది రూ.లక్షపైన రుణం కలిగి ఉండటం, మరికొందరు షేర్ క్యాపిటల్ రూ.300 మాత్రమే ఉండటంతో ఓటు హక్కు కోల్పోయినట్లు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ అధికారులు చెబుతున్నారు. అలాగే సభ్యులుగా ఉన్న కొందరు రైతులు చనిపోయినప్పటికీ వారి పేర్లను ఇంకా తొలగించలేదు. అయితే వారి ఓట్లు లేనట్లుగానే నిర్ధారించారు. ఎంతమంది చనిపోయారన్న దానిపై స్పష్టత రావడం లేదు. అలాగే రెండేళ్ల క్రితం సహకార సంఘాల ద్వారా కొందరు ద్విచక్ర వాహనాలు, పాడి గేదెల కొనుగోలుకు రుణం పొందారు. వాయిదాలను సక్రమంగా చెల్లించని వారిని ఓడీ జాబితాల్లో చేర్చారు. ఇదిలా ఉండగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
సిద్దిపేట జిల్లాల్లో ఎక్కువ మంది అనర్హులు..
ఇక సిద్దిపేట జిల్లాలో 1,90,669 మంది సభ్యులుండగా, కేవలం 62,972 మంది మాత్రమే ఓటింగ్‌కు అర్హత సాధించగా.. 1.27 లక్షల మంది సభ్యులు అనర్హులయ్యారు. నల్లగొండ జిల్లాలోనూ 1,41,895 మంది సభ్యులుండగా, 1,09,380 మంది రైతులే అర్హులయ్యారు. నిజామాబాద్‌లోనూ 1,48,241 సభ్యులకుగాను 1,15,211 మంది, వరంగల్ రూరల్‌లో 1,50,530 సభ్యులకు గాను 97,599 మంది, మహబూబాబాద్‌లో 1,13,607 సభ్యులకుగాను 70,658 మంది, మెదక్‌లో 1,19,675 సభ్యులకుగాను 55,086 మంది మాత్రమే అర్హులైనట్లు రాష్ట్ర ఎన్నికల సహకార అథారిటీ వెల్లడించింది. ఇలా ప్రతీ జిల్లాలో, ప్రతీ ప్యాక్స్‌లో ఓవర్ డ్యూ కారణంగా ఓటింగ్‌కు, పోటీకి దూరమయ్యారు.
వాస్తవానికి ప్యాక్స్‌లో బకాయిలు కొంత ఉన్నా అనర్హులవుతారు. అయితే ఈసారి రూ.లక్షలోపున్న రైతులకు మాత్రం పోటీ చేయడానికి అవకాశం కల్పించారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలోపు రుణమాఫీ ప్రకటించినందున, ఆ మేరకు మినహాయింపునిస్తూ సహకార ఎన్నికల అథా రిటీ అంతర్గత ఆదేశాలు జారీచేసింది. కొత్త ప్యాక్స్‌ల ఏర్పాటు అనంతరం అంటే జూన్‌లో ఎన్నికలు జరుగుతాయన్న భావనలో చాలామంది ఉన్నారు. దీంతో వారంతా రుణాలు చెల్లించలేకపోయారు. నోటిఫికేషన్ ఆగమేఘాల మీద ఇవ్వడం, తక్షణమే ప్రక్రియ మొదలు కావడంతో రుణాలు చెల్లించే సమయం లేకుండా పోయిందని రైతులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment