సాక్షి, హైదరాబాద్: పురపోరుకు నామినేషన్లు వెల్లువెత్తాయి. పత్రాల సమర్పణకు చివరి రోజైన శుక్రవారం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపాలిటీల్లోని నామినేషన్ దాఖలు చేసే కార్యాలయాల్లో పలు పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు, వారి కుటుంబసభ్యులు, అనుయాయుల సందడి కనిపించింది. శుక్రవారం రాత్రి 7.45 గంటల వరకు అందిన సమాచారం మేరకు.. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు కలిపి మొత్తం 21,850 నామినేషన్లు (ఆన్‌లైన్‌లో అందిన 574 నామినేషన్లు) అందినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) వెల్లడించింది. శనివారం పూర్తి వివరాలు అందాక మొత్తం నామినేషన్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రకటిస్తామని ఎస్‌ఈసీ వర్గాలు తెలిపాయి.
ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన అభ్యర్థులు స్వయంగా రిటర్నింగ్ ఆఫీసర్లకు దరఖాస్తు కాపీలను సమర్పించాల్సి ఉన్నందున మొత్తంగా నామినేషన్లను సరిచూశాక దాఖలైన పత్రాల సంఖ్యపై శనివారం స్పష్టత రానుంది. బుధవారం నుంచి నామినేషన్ల దాఖలు మొదలు కాగా మూడు రోజులు కలిపి మొత్తం 21,850 నామినేషన్లను ప్రధాన పార్టీలు, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు సమర్పించారు. వీటిలో రంగారెడ్డి జిల్లా పరిధిలోని 15 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అత్యధికంగా 2,392 నామినేషన్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మున్సిపాలిటీలో అత్యల్పంగా 134 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికలు జరగనున్న 9 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 325 డివిజన్లకు 120 మున్సిపాలిటీల పరిధిలోని 2,727 వార్డులకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
శనివారం ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన మొదలుపెట్టి, అది పూర్తికాగానే చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై 12న సాయంత్రం 5 గంటల దాకా జిల్లా ఎన్నికల అధికారి లేదా అదనపు జిల్లా ఎన్నికల అధికారి/ డిప్యూటీ ఎన్నికల అధికారి లేదా జిల్లా ఎన్నికల అధికారి నియమించిన అధికారి వద్ద అప్పీల్ చేసుకోవచ్చు. 13న సాయంత్రం 5 గంటల లోగా ఈ అప్పీళ్లను పరిష్కరిస్తారు.
14న మధ్యాహ్నం 3 గంటల దాకా నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం. అదేరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీచేసే అభ్యర్థుల తుది జాబితాలు ›ప్రచురిస్తారు. 22న పోలింగ్, రీపోలింగ్ ఏవైనా ఉంటే 24న నిర్వహిస్తారు. 25న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి, అది పూర్తి కాగానే ఫలితాలు ప్రకటిస్తారు. ఇదిలా ఉండగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బీ ఫారాల పంపిణీని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా సంగారెడ్డి ఎమ్మె ల్యే జగ్గారెడ్డికి శుక్రవారం గాంధీభవన్‌లో పార్టీ బీ ఫారాలను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అందజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసకృష్ణన్‌ల సమక్షంలో సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన బీ ఫారాలను జగ్గారెడ్డి చేతికి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment