సాక్షి, అమరావతి : ‘అన్ని నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే కేటాయిస్తున్నాం. నామినేటెడ్ పనుల్లో కూడా 50% ఆ వర్గాలకే ఇస్తున్నాం. మొత్తం మీద మహిళలకు 50 శాతం పదవులు ఇస్తున్నాం. ఈ మేరకు దేశంలో చట్టం చేసిన ఏకైక రాష్ట్రం మనదేనని గర్వంగా చెబుతున్నా’ అని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సలహాదారుల నియామక అంశంపై అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నపై ఆయన స్పందించి మాట్లాడారు. ఇప్పటికే ఆ వర్గాలకు చాలా పదవులు ఇచ్చామని, స్థానిక ఎన్నికల తర్వాత మిగిలిన పోస్టులు కూడా భర్తీ చేసి ఇదే శాసనసభలో తుది జాబితాను విడుదల చేస్తామన్నారు. ఆయా వర్గాల వారికి ఇస్తున్న ప్రాధాన్యతను ఇలా వివరించారు.
బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకే పెద్దపీట
‘నామినేటెడ్ పదవుల అంశాన్ని చంద్రబాబు పార్టీ వక్రీకరిస్తోంది. ఇంతగా వక్రీకరించే పార్టీ ప్రపంచంలో మరెక్కడా లేదు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై చట్టం చేశాం. నామినేటెడ్ పనుల్లో కూడా ఈ వర్గాల వారికి 50 శాతం కల్పించిన ఏకైక రాష్ట్రం మనదే. ఇందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాం. రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉన్న ఓసీలకు చెందిన వారికే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ(ఏఎంసీ) చైర్మన్ పదవులు ఇచ్చే పరిస్థితి ఉండేది. అలాంటి పోస్టుల్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. కృష్ణా జిల్లాలో 19 మార్కెట్ కమిటీ పోస్టులు ఉంటే.. అందులో 10 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చాం. దాంతోపాటు దేవాలయాల చైర్మన్ల పదవుల్లోనూ రిజర్వేషన్లు పాటిస్తున్నాం. ఎంతో పలుకుబడి ఉంటే తప్ప దేవాలయ చైర్మన్ పదవి వచ్చేది కాదు. కానీ మా ప్రభుత్వం దేవాలయాల చైర్మన్లు, సభ్యుల పదవుల్లో సైతం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి 50 శాతం ఇస్తోంది. మొన్నటికి మొన్న డీసీసీబీలు, డీసీఎంఎస్‌లు 13 ఉంటే.. అందులో 7 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చాం.
తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నందమూరి లక్ష్మీపార్వతిని నియమించాం. ఈమె టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సతీమణి, చంద్రబాబుకు స్వయానా అత్త గారు. లక్ష్మీపార్వతికి వాళ్లు ఏమీ ఇవ్వలేదు. కానీ మేం ఇచ్చాం. ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ జాబితాలో సగానికిపైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారు. అయినా ఇది ప్రతిపక్షానికి కనిపించదు. ఇంకా 160కిపైగా చైర్మన్ స్థాయి నామినేటెడ్ పోస్టులు పెండింగులో ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాక వాటన్నింటినీ భర్తీ చేస్తాం. తుది జాబితా వచ్చే సరికి 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే ఉంటారు. అన్ని పోస్టులు భర్తీ చేసి మొత్తం జాబితాను ఇదే చట్టసభలో విడుదల చేస్తాం.
సలహాదారులవి నామినేటెడ్ పోస్టులు కావు
సలహాదారుల విషయానికొస్తే అవి నామినేటెడ్ పదవులు కావు. ఆయా రంగాల్లో నైపుణ్యం ఉన్న వారిని సలహాదారులుగా నియమిస్తారు. వారు ఆయా రంగాలకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వడం ద్వారా విలువ, సామర్థ్యాన్ని పెంచగలుగుతారని భావించి నియమిస్తారు. కుటుంబరావును చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు? ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే తీసుకున్నారని ఇవాళ నేను అనొచ్చు. నేను ఇక్కడ కులాన్ని ప్రస్తావించదలుచుకోలేదు.
కేబినెట్‌లో 60 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే
మా కేబినెట్లో సుమారు 60 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలున్నారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉంటే.. అందులో నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలేనని గర్వంగా చెప్పగలుగుతాం. ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఎవరని ఎవరినైనా అడిగితే.. దళిత మహిళ అని చెబుతారు. పిల్లలకు చదువులు చెప్పించే విద్యా శాఖ మంత్రి ఎవరని అడిగితే.. మాదిగ సామాజిక వర్గానికి చెందిన సురేష్ అని, రెవిన్యూ మంత్రి ఎవరంటే బీసీ వర్గానికి చెందిన సుభాష్ చంద్రబోస్ అని గర్వంగా చెప్పగలుగుతా. అలా ప్రతి అడుగులోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మాదే’ అని వైఎస్ జగన్ అన్నారు.
నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకే
Published Thu, Dec 12 2019 4:57 AM | Last Updated on Thu, Dec 12 2019 4:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment