17వ లోక్‌సభకు.. కొత్త ముఖాలు! | 6819 candidates in 17 lok sabha elections 2019 | Sakshi
Sakshi News home page

17వ లోక్‌సభకు.. కొత్త ముఖాలు!

Published Mon, May 13 2019 5:03 AM | Last Updated on Mon, May 13 2019 5:04 AM

6819 candidates in 17 lok sabha elections 2019 - Sakshi

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో చివరిదైన ఏడో దశ  ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు కూడా ఖరారవడంతో ఈ ఎన్నికల్లో మొత్తం ఎంత మంది పోటీ చేస్తున్నారన్నది స్పష్టమయింది. లోక్‌సభ లోని 543 స్థానాలకు గాను రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 8,048 మంది పోటీ చేస్తున్నారు(గత ఎన్నికలో 8,794 మంది పోటీ చేశారు). అయితే, వీరిలో 85 శాతం అంటే 6,819 మంది ఎన్నికలకు కొత్త వారే. అంటే మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారు. మిగతా వారిలో 8 శాతం రెండోసారి, 3.2 శాతం మూడోసారి, 1.5 శాతం నాలుగోసారి పోటీ చేస్తున్నారు. నాలుగు సార్లకు మించి పోటీ చేస్తున్న వారు 2.2 శాతం  ఉన్నారు. అభ్యర్థుల్లో 85 శాతం కొత్త వారే కాబట్టి ఎన్నికల తర్వాత ఏర్పడబోయే 17వ లోక్‌సభలో కొత్త ముఖాలే ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.    

ఈ ఎన్నికల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీల తరఫున మొత్తం 2,163 మంది బరిలో దిగారు. 2,445 మంది చిన్న చిన్న పార్టీల తరఫున, 3,440 మంది ఇండిపెండెంట్లుగా ఎన్నికల గోదాలో కలబడుతున్నారు.
ఈ సారి  ప్రధాన రాజకీయ పార్టీలు కూడా చాలా మంది సిట్టింగులను పక్కన పెట్టేశాయి. 2014 ఎన్నికల్లో 73 శాతం సిట్టింగు ఎంపీలకు టికెట్లు లభిస్తే, ఈ సారి 59 శాతం సిట్టింగులకే మళ్లీ పోటీ చేసేందుకు అవకాశం దక్కింది. అంటే  ప్రతి పది మంది సిట్టింగ్‌ ఎంపీల్లో దాదాపు నలుగురు  పోటీ చేసే అవకాశం కోల్పోయా రు. పార్టీల వారీగా చూస్తే భారతీయ జనతా పార్టీకి 275 మం ది ఎంపీలుంటే  వారిలో 156 మందికే ఈ సారి పోటీ చేసేందుకు టికెట్టు ఇచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ 48 మంది సిట్టింగ్‌ ఎంపీల్లో 28 ఎంపీలకే మళ్లీ అవకాశం ఇచ్చింది.

ప్రాంతీయ పార్టీలదీ అదే దారి
ప్రాంతీయ పార్టీలు కూడా ఈ సారి ఎక్కువ మంది కొత్త వారిని ఎన్నికల్లో నిలబెట్టాయి.ప్రస్తుత లోక్‌సభలో ప్రాంతీయ పార్టీల ఎంపీలు మొత్తం 139 మంది ఉంటే, వారిలో 63 మంది(45.5%) మాత్రమే ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అంటే 50 శాతానికిపైగా కొత్త ముఖాలే ప్రాంతీయ పార్టీల తరఫున పోటీ చేస్తున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే 37 మంది ప్రస్తుత ఎంపీల్లో కేవలం ఆరుగురికే మళ్లీ టికెట్‌ ఇచ్చింది. ఒడిశా లోని బీజేడీ 20 మంది సిట్టింగులకుగాను నలుగురినే తిరిగి బరిలో దింపింది. ఏపీలో తెలుగు దేశం పార్టీ 16 మంది సిట్టింగు ఎంపీల్లో పది మందినే మళ్లీ  పోటీ చేయిస్తోంది.

వైఎస్సార్‌సీపీ తొమ్మిది మంది సిట్టింగు ఎంపీల్లో ఏడుగురికి టికెట్‌ ఇవ్వలేదు. తెలంగాణలోని టీఆర్‌ఎస్‌కున్న 11 మంది సిట్టిం గ్‌ ఎంపీల్లో ఏడుగురు మళ్లీ పోటీ చేస్తున్నారు. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ ఏడుగురిలో నలుగురినే మళ్లీ పోటీ చేయిస్తోంది. ప్రధాన పార్టీలు, ప్రాంతీయ పార్టీలూ కూడా ఈ సారి కొత్త వారినే ఎక్కువ మందిని ఎన్నికల్లో నిలబెట్టా యి. ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చినా, యూపీఏ సర్కారు వచ్చినా కూడా చాలా మంది ఎంపీలు కొత్తవారే అవుతారు.

90వ దశకం నుంచీ....
1990 దశకం చివరి నుంచి ఎన్నికల్లో సిట్టింగులను పక్కన పెట్టడం పెరుగుతూ వస్తోంది. ప్రధాన పార్టీలు సిట్టింగు ఎంపీలను మార్చడానికి కారణాలు అనేకం ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ప్రభుత్వ వ్యతిరేకతను తప్పించుకోవడం.అధికార పార్టీపై ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ సార్లు అధికారంలో కొనసాగిన పార్టీలపై సహజంగానే  వ్యతిరేకత ఉంటుంది. అలాంటి పార్టీ మరోసారి అధికారం కైవసం చేసుకోవానుకున్నప్పుడు ప్రజా వ్యతిరేకతను అధిగమించడం కోసం కొత్త వారికి టికెట్లు ఇస్తుంది.

సిట్టింగ్‌ల పనితీరు, నియోజకవర్గాల్లో సదరు వ్యక్తికున్న బలం, ఆర్థిక పుష్టి వంటి అంశాలు కూడా అభ్యర్థి మార్పుకు దారి తీస్తాయి. మోదీ అయితే, ప్రతి ఎన్నికల్లో దాదాపు 50 శాతం కొత్త వారికి టికెట్లు ఇవ్వడమన్నది గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అమలు చేస్తున్న వ్యూహం. ప్రధాని అయ్యాక లోక్‌సభ ఎన్నికల్లో కూడా దీనినే అమలు పరుస్తున్నారు. అభ్యర్థులను మార్చే విషయంలో  బీజేపీ కంటే కాంగ్రెస్‌ వెనకబడి ఉందని చెప్పాలి. చాలా ఏళ్లుగా ఆ పార్టీ అభ్యర్థుల ఎంపికలో విధేయతకే పెద్దపీట వేస్తూ వచ్చింది.

కాబట్టి పనితీరు, ప్రభుత్వ వ్యతిరేకత ఎలా ఉన్నా చాలా మంది సిట్టింగులకే టికెట్లు లభించేవి. అయితే,  ఈ సారి ఆ పార్టీ కూడా చాలా మంది సిట్టింగులను పక్కన పెట్టడం పార్టీ కొత్త అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెచ్చిన మార్పుగా పరిశీలకులు భావిస్తున్నారు. సిట్టింగులు,అనుభవజ్ఞులకు బదులు కొత్త వారు ఎన్నికవడం శుభసూచకమే అయినా, పాత వారి రాజకీయ, పరిపాలన అనుభవం వ్యర్ధమయినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా కొత్తగా ఎన్నికయిన వారు కూడా రెండో దఫా మళ్లీ అవకాశం వస్తుందో రాదో అన్న ఆందోళనతో విధి నిర్వహణపై శ్రద్ధ చూపించలేరని వారు అభిప్రాయపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement