సాక్షి, అమరావతి : గ్రామీణ విద్యార్థుల ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేందుకే పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను తీసుకువస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 70 లక్షల మంది విద్యార్థుల్లో 43 శాతం మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. వీరిలో 33.23 శాతం ఎస్టీలు,49. 6 శాతం ఎస్సీలు, 62.5 శాతం బీసీ విద్యార్థులు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారని తెలిపారు. గతంలోనే పట్టణ ప్రాంతాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నా గ్రామీణ స్థాయిలో మాత్రం అవి చెప్పుకునే విధంగా లేవని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 'నాడు-నేడు' పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేలా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. ఒకవేళ 'నాడు-నేడు' కార్యక్రమం విజయవంతం అయితే నారా లేడు అన్న పరిస్థితి వస్తుందన్న ఆందోళన టీడీపీ నేతల్లో నెలకొన్నట్లు పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్యను భోదించేందుకు 98వేల మంది టీచర్లకు ఇఫ్లూ పనిచేస్తున్న నిపుణులతో శిక్షణ ఇప్పిస్తామని మంత్రి ప్రకటించారు. పనిగట్టుకొని విమర్శలు గుప్పిస్తున్న కన్నా లక్ష్మీ నారాయణ, చంద్రబాబు, రామోజీరావు మనవళ్లు తెలుగుమీడియం చదువుతున్నారా అంటూ ప్రశ్నించారు. మేము అమలు చేయబోతున్న ఇంగ్లీష్ మీడియం విధానంలో తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా ఉంటుందని మంత్రి స్పస్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment