న్యూఢిల్లీ : తాను పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అసంతృప్త నేత, చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్కా లంబా స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఆగష్టు 4న అధికారిక ప్రకటన చేస్తానని వెల్లడించారు. పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో తన నెంబరు తొలగించడం, ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్‌లో తనను అన్‌ఫాలో చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో పొమ్మనలేక పొగపెడుతున్నారంటూ అల్కా లంబా గత కొంతకాలంగా ఆప్ తీరును విమర్శిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో అల్కా లంబా మీడియాతో మాట్లాడుతూ...‘ పార్టీ సమావేశాలకు నన్ను పిలవడం లేదు. గతంలో ఎన్నోసార్లు నన్ను అవమానించారు. ఇప్పటికీ అవమానిస్తూనే ఉన్నారు. 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగాను. అక్కడ కుటుంబ రాజకీయాల వల్ల ఎంతో వేదనకు గురికావాల్సి వచ్చింది. ఇక ఆప్‌లో కనీసం గౌరవం కూడా ఉండదు. అందుకే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నా. నా నియోజకవర్గ అభివృద్ధికై ప్రభుత్వం కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చయిన మరుసటి రోజు పార్టీని వీడతాను’ అని స్పష్టం చేశారు.
కాగా అల్కా లంబా వ్యాఖ్యలపై ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె ఇలా ప్రవరిస్తున్నారంటూ విమర్శించారు. తన ఎమ్మెల్యే పదవిని వదులుకోవడం ఆమెకు ఇష్టం లేదని... ఒకవేళ పార్టీని వీడాలనుకుంటే రాజీనామా పత్రాన్ని పార్టీ అధిష్టానానికి పంపించాల్సింది అని వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నోసార్లు అల్కా లంబా ఇలాగే మాట్లాడారని, మీడియా దృష్టిని ఆకర్షించడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇక సిక్కు వ్యతిరేక అల్లర్లలో రాజీవ్ గాంధీపై కూడా ఆరోపణలు ఉన్నాయని, ఆయనకిచ్చిన దేశ అత్యున్నత పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ అసెంబ్లీ గతంలో తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆల్కా లంబా పేర్కొన్నారు. దీంతో ఆమె పార్టీని వీడనున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment