ఆదివారం శ్రీరంగపట్నలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమంలో అమిత్ షా
మైసూరు: కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపులో తాము ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలను వేర్వేరుగా చూడటం లేదనీ, కేంద్రం పక్షపాతంతో వ్యవహరిస్తోందనడం అవివేకమని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. ‘కర్ణాటకలో సిద్దరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుకథలు చెప్పి, బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. కానీ ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీని సమాధి చేయడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు’ అని అన్నారు.
కర్ణాటకలో వచ్చే నెలలో జరగనున్న శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా షా మైసూరులో శుక్ర, శనివారాల్లో పర్యటించారు. కాంగ్రెస్ అధిష్టానానికి కావాల్సినంత డబ్బిచ్చే ఏటీఎంలా కర్ణాటక ప్రభుత్వం వ్యవహరిస్తోందనీ, అవినీతి సర్కారును గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సర్కారు రైతుల రుణమాఫీకి సంబంధించి ఇప్పటివరకు బ్యాంకులకు ఒక్క రూపాయీ విడుదల చేయలేదనీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తుండగా కర్ణాటకలో ఎందుకు సాధ్యం కావట్లేదని షా ప్రశ్నించారు.
ఒంటరిగానే కర్ణాటకలో పోరాటం
కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని అమిత్ షా చెప్పారు. దేవెగౌడ నాయకత్వంలోని జేడీఎస్‌తో పాటు ఏ ఇతర పార్టీతోనూ మైత్రికి సిద్ధంగా లేమని స్పష్టంచేశారు. దేశంలో బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతోందని, కర్ణాటకలోనూ గెలిచి దక్షిణాదిలో బీజేపీ సత్తా చాటుతుందన్నారు. ఎన్నికల జిమ్మిక్కుల్లో భాగంగానే లింగాయత్ ఓట్ల కోసం వారికి ప్రత్యేక మతం హోదాను కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చిందని అమిత్ షా విమర్శించారు. మాజీ మంత్రి గాలిజనార్ధనరెడ్డికి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని అమిత్ షా ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment