
ఉగ్రమూకలను పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమని
న్యూఢిల్లీ : కశ్మీర్ వివాదానికి మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రునే కారణమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లుపై శుక్రవారం లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు తాము ప్రజల మనోగతాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదంటున్నాయని.. కానీ నెహ్రు అప్పటి హోం మంత్రి పటేల్ అభిప్రాయం తీసుకోకుండానే.. పీవోకే ప్రాంతాన్ని పాకిస్తాన్‌కు ఇచ్చేశారని అన్నారు. కశ్మీర్‌ను అభివృద్ధి చేయడమే తమకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్ బిల్లు కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుతో పాటు, నియంత్రణ రేఖ వెంబడి నివసిస్తున్న.. ఆర్థికంగా వెనుకబడినవారికి మేలు చేకూరుస్తుందని తెలిపారు.
ఉగ్రమూకలను పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమని అమిత్ షా స్పష్టం చేశారు. సర్జికల్ దాడులను సమర్థించిన అమిత్ షా.. ఈ దాడిలో ఒక పౌరుడు కూడా చనిపోలేదని అన్నారు. తాము ఆర్టికల్ 356ని రాజకీయ లబ్ధికి వాడుకోలేదని పేర్కొన్నారు. మరోవైపు కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కశ్మీర్‌లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అంతకుముందు జమ్ము కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ అమిత్ షా పార్లమెంట్‌లో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఏడాది చివర్లో జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. కశ్మీర్‌లో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదని అన్నారు.