మేయర్, బీజేపీ నాయకులతో మాట్లాడుతున్న గవర్నర్ ఆనందిబెన్ పటేల్
సాత్నా : మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనంది పటేల్ నగర మేయర్‌తో జరిపిన సంభాషణ తాలూకు వీడియో వైరల్ అవుతోంది. విషయమేమిటంటే.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం మధ్యప్రదేశ్‌కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు గవర్నర్ చిత్రకూట్‌కు వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మేయర్, ఇతర బీజేపీ నేతలతో ఆమె మాట్లాడారు. పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులను, నిస్సహాయులను దత్తత తీసుకున్నపుడే మీకు ఓట్లు పడతాయంటూ వారికి సూచించారు. ఇందుకోసం క్యాంపెయిన్ నడపండి. ఇతరుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోండి అంటూ మేయర్ మమతా పాండేకి చెప్పారు. అందుకు సమాధానంగా ఆమె అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లల్ని దత్తత తీసుకున్నామని తెలిపారు.
అయితే ‘ఓట్లు కావాలంటే ఇది సరిపోదు. గ్రామాల్లోకి వెళ్లాలి. ప్రజల ఇళ్లలోకి వెళ్లి వారి చేతులు పట్టుకుని మాట్లాడాలి. అప్పుడే నరేంద్ర భాయ్(ప్రధాని మోదీ) 2022 కల నెరవేరుతుందంటూ’ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ వ్యాఖ్యానించారు. అంతేకాదు అక్కడున్న అధికారులతో మాట్లాడుతూ ‘మీకు ఓట్లు అవసరం లేదు. కానీ మాకు అవసరం’ అంటూ పేర్కొన్నారు.
కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ గవర్నర్‌పై విమర్శనాస్త్రాలు సంధించింది. రాజ్యాంగ పరంగా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఈవిధంగా మాట్లాడడం అధికార దుర్వినియోగానికి పాల్పడటమేనని విమర్శించింది. వచ్చే ఏడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గవర్నర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment