నగర వీధుల్లో సాగుతున్న ఆటో ర్యాలీ
అనంతపురం: ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్ర సీఎం చంద్రబాబు ఇద్దరూ తోడుదొంగలేనని వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంటు అధ్యక్షుడు, అనంతపురం అసెంబ్లీ సమన్వయకర్త అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు ఏడాదికి రూ. 10 వేలు ఇస్తామంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం వైఎస్సార్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి టవర్‌క్లాక్ వరకు సాగిన ర్యాలీని అనంత వెంకట్రామిరెడ్డితో పాటు, ఆ పార్టీ అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య ప్రారంభించి, మాట్లాడారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోలు, డీజిల్ బ్యారెల్ ధరలు తగ్గినా రాష్ట్రంలో వివిధ పన్నులు వేస్తూ ధరలు పెంచుతున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్వార్థ రాజకీయాలకు ఈ నాలుగేళ్ల కాలం కాస్తా గడిచిపోయిందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో, నిరుద్యోగ సమస్య తీర్చడంలో ఉభయ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. ఇన్నిరోజులు బీజేపీ, టీడీపీ సఖ్యతగా ఉంటూ ప్రజల్ని పీడించి దోపిడీ చేశాయన్నారు. కులమతాల మధ్య విద్వేషాలు రగిల్చి నాలుగేళ్ల తర్వాత తాము విడిపోయామంటూ ప్రజల్ని మరోమారు మోసగించేందుకు వస్తున్నారన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేసిన వీరిద్దరికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
డిగ్రీలు, ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు ఉద్యోగాలు లభ్యం కాక బతుకు తెరువు కోసం ఆటోలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారని గుర్తు చేశారు.
ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, రోడ్డు ట్యాక్స్ ఉంటేనే ఆటోలు నడుపుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లకు ఆర్ధిక భారం తగ్గించేందుకు అధికారంలోకి వస్తే ఏడాదికి రూ. 10వేలు ఇస్తామంటూ తమ అధినేత జగన్ ప్రకటించడం హర్షణీయమన్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల్లాంటి పథకాలతో అన్ని వర్గాలూ లబ్ధి పొందుతాయన్నారు. జగన్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగే పరుశురాం మాట్లాడుతూ... వైఎస్ హయాంలో సంక్షేమ పథకాల అమలులో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలూ లబ్ధి పొందాయని గుర్తు చేశారు. వైఎస్ జగన్ సీఎం అయితే తిరిగి అలాంటి పాలనే అందుతుందన్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైవీ శివారెడ్డి మాట్లాడుతూ ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రకటన చేసిన వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఆటో యూనియన్ అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా, నాయకులు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, అనంత చంద్రారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు రిలాక్స్ నాగరాజు, అబూసాలెహ, శేఖర్‌బాబు, జయరాంనాయక్, డాక్టర్ మైనుద్దీన్, కార్పొరేటర్లు జానకి, గిరిజమ్మ, హిమబిందు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, రాష్ట్ర కార్యదర్శులు దేవి, కొండమ్మ, పార్వతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment