పోలవరం పూర్తి చేసే సత్తా మాకే ఉంది | Anil Kumar Yadav comments on Polavaram | Sakshi
Sakshi News home page

పోలవరం పూర్తి చేసే సత్తా మాకే ఉంది

Published Sat, Jul 20 2019 4:37 AM | Last Updated on Sat, Jul 20 2019 7:52 AM

Anil Kumar Yadav comments on Polavaram - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం పూర్తి చేసే సత్తా తమ ప్రభుత్వానికే ఉందని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. శాసనసభలో శుక్రవారం టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. చంద్రబాబు సర్కార్‌ పోలవరాన్ని పూర్తిగా రాజకీయం చేసిందని, కాంట్రాక్టుల అప్పగింతలో భారీగా ముడుపులు తీసుకుందని ఆరోపించారు. కాగా.. మంత్రి ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుపడి పోడియం వద్దకు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ దశలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుని విపక్ష వైఖరిని ఎండగట్టారు. మహిళలపై నేరాలు జరగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత సభకు తెలిపారు. మహిళలపై లైంగిక దాడుల నిరోధానికి శక్తి మహిళా మొబైల్‌ కాప్, మహిళా పోలీస్‌ వలంటీర్లు, మహిళా హెల్ప్‌లైన్లు, మహిళా మిత్ర, మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్లు ఏర్పాటు చేశామని వివరించారు.

ఈ సందర్భంగా పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో మహిళలపై అత్యాచారం కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఐదో స్థానంలో ఉందన్నారు. మైనింగ్‌పై జరిగిన చర్చలో ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ మైనింగ్‌లో గిరిజనులను అన్ని విధాలా ఆదుకోవాలని, ఆదాయాన్ని అందించాలని కోరారు. సభలో ఆయన వేసిన ప్రశ్నకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బదులిస్తూ.. గిరిజన ఏజెన్సీల విషయంలో లీజును వేలం విధానం ద్వారా గిరిజనులు, ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే మంజూరు చేయాలని చట్టం చెబుతోందన్నారు. పంచాయతీలకు మైనింగ్‌ నుంచి రావాల్సిన రాయిల్టీ ఇప్పించాలని ఎమ్మెల్యే కళావతి కోరారు. ఇక నుంచి ప్రతి నెలా ఒకటి, మూడు శనివారాల్లో ప్రాథమిక పాఠశాల స్థాయిలో విద్యార్థులు స్కూళ్లకు పుస్తకాల బ్యాగులు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ చెప్పారు. 

ఇసుక అక్రమ రవాణాపై 489 కేసులు: మంత్రి పెద్దిరెడ్డి
ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 489 కేసులు నమోదు చేశామని, రూ.1.20 కోట్లకు పైగా జరిమానా వసూలు చేశామన్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం స్పీకర్‌ తమ్మినేని సీతారాం జీరో అవర్‌కు అనుమతించారు. తిరుపతి ప్రజలు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. సంప్రదాయేతర ఇంధన కొనుగోళ్ల వ్యవహారంలో గత ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతికి పాల్పడిందని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయింపులపై చర్చ జరపాలని అన్నా రాంబాబు డిమాండ్‌ చేశారు. దీనిపై స్పీకర్‌ స్పందిస్తూ.. పార్టీ ఫిరాయింపుల అంశం దేశవ్యాప్తంగా ఉందని, మన అసెంబ్లీలోనే చర్చించి దేశానికి ఆదర్శమవుదామని చెప్పారు. 

చీకటి అధ్యాయం బాబు పాలన
వ్యవసాయానికి రూ.18,130.83 కోట్లు, సహకార రంగానికి రూ.234.64 కోట్లు మంజూరు చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. అనంతరం వ్యవసాయ పద్దుపై సభలో చర్చ జరిగింది. ఎమ్మెల్యే ప్రసాదరాజు మాట్లాడుతూ వ్యవసాయానికి రూ.28,886 కోట్లను కేటాయించిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. చంద్రబాబు పాలన రైతుల పాలిట చీకటి అధ్యాయమని విమర్శించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement