
ఉప ఎన్నికల ప్రచారంలో ఓటర్లను హెచ్చరించిన ఎంపీ మంత్రి మాయాసింగ్
సాక్షి, భోపాల్ : మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినెట్‌లో మరో మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఓటు వేసిన వారికే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుతాయని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వృధా అని మంత్రి మాయా సింగ్ ఓటర్లతో పేర్కొనడం దుమారం రేపింది. ‘కమలం గుర్తుకు ఓటు వేస్తే అంతా సవ్యంగా సాగుతుంది..చేయి గుర్తుకు ఓటేస్తే మాత్రం మీరు పొరపాటు చేసినట్టే’నని మంత్రి ఉప ఎన్నికల ప్రచారంలో ఓటర్లను హెచ్చరించారు.
చేయి గుర్తుకు ఓటేసి తప్పు చేసిన వారు ఏ ప్రయోజనం పొందలేరని స్పష్టం చేశారు. అంతకుముందు బీజేపీ ఎంఎల్‌ఏ యశోధరరాజె సింధియా కోలరస్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు పరోక్ష హెచ్చరికలు చేశారు. ఉచిత గ్యాస్ పథకం బీజేపీ ప్రవేశపెట్టిందని..తమ పార్టీకి ఓటు వేస్తేనే మీకు గ్యాస్ వస్తుందని..కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఈ పథకం మీకు వర్తించదని ఆమె వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ మంత్రి ఓటర్లను హెచ్చరించడం పట్ల మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అరుణ్ యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనావళికి విరుద్ధంగా మంత్రి వ్యాఖ్యలున్నాయని ఆరోపించారు.