
బీజేపీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ యువమోర్చా శనివారం (ఆగస్టు 11) చేపట్టనున్న ర్యాలీలో పాల్గొననున్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిశాయి. మరి కొద్ది గంటల్లో షా బెంగాల్ చేరుకోనుండగా ‘బెంగాల్ వ్యతిరేకులు గో బ్యాక్’ అని రాసి ఉన్న పోస్టర్లు రోడ్ల వెంట దర్శనమిస్తున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన అస్సాం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ) తుది ముసాయిదాపై మమత ఎక్కువగా స్పందించడంతో బీజేపీ టీఎంసీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగాల్‌లో మమత ప్రాబల్యం తగ్గించే వ్యూహంలో భాగంగానే అమిత్ షా ఈ ర్యాలీ ఉపయోగించుకోనున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈ ర్యాలీ దోహదపడుతుందని అమిత్ షా భావిస్తున్నట్టు తెలిసింది. తొలుత ఈ ర్యాలీకి అనుమతినివ్వబోమని బెంగాల్ ప్రభుత్వం ప్రకటించగా.. దమ్ముంటే అరెస్టు చేసుకోండని అమిత్ షా స్పందించిన విషయం తెలిసిందే. అయితే, ర్యాలీకి బెంగాల్ బీజేపీ అనుమతి కోరడంతో పోలీసులు అనుమతినిచ్చారు. కాగా, ఎన్నార్సీ నివేదిక ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు రేపగా.. ర్యాలీతో మరింత వేడి రాజుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment