పవార్‌ కొత్త ఎత్తుగడ! | This anti-BJP Protest March is  Pawar Political Power | Sakshi
Sakshi News home page

ప్రతిపక్ష కూటమి నేతగా శరద్‌ పవార్‌ పావులు

Published Thu, Jan 18 2018 4:57 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

 This anti-BJP Protest March is  Pawar Political Power - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దించేందుకు ఐక్యం కానున్న ప్రతిపక్షాల కూటమికి తానే నాయకుడిగా తెరముందు ప్రత్యక్షం కావాలని నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్‌ శరద్‌ పవార్‌ కోరుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది. అందులో భాగంగానే ఆయన జనవరి 26వ తేదీన 'సంవిధాన్‌ బచావో' ర్యాలీ నిర్వహిస్తున్నారని, దానికి అన్ని పార్టీల జాతీయ నాయకులను పిలుస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకే తాను ఈ ర్యాలీ నిర్వహిస్తున్నానని శరద్‌ పవార్‌ ఇప్పటికే చెప్పుకున్నారు.
 
భారత రాజ్యాంగం పీఠికలోని 'లౌకిక (సెక్యులర్‌)' పదాన్ని తొలగించేందుకు రాజ్యాంగాన్ని మార్చాల్సిందేనంటూ పలుసార్లు బీజేపీ నేతలు ప్రకటించినప్పటికీ ఆ దిశగా ఆ పార్టీ ప్రభుత్వం చర్యలేమీ తీసుకోలేదు. అయినప్పటికీ అత్యవసర సమస్యగా భావించి శరద్‌ పవార్‌ 'సంవిధాన్‌ బచావో' ర్యాలీ నిర్వహించడం అంటే ఏదో మతలబు ఉన్నట్లేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫారూక్‌ అబ్దుల్లా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి, సీపీఐ నాయకుడు డీ రాజా, జేడీయూ మాజీ నాయకుడు శరద్‌ యాదవ్‌లను శరద్‌ పవార్‌ స్వయంగా ఆహ్వానించినట్లు తెల్సింది. రాహుల్‌ గాంధీని స్వయంగా పిలిచారా, లేదా ? తెలియడం లేదు. కానీ ర్యాలీకి రావాల్సిందిగా ఆహ్వానించారు.

ప్రతిపక్ష కూటమికి నాయకుడిని కావాలని ఆశిస్తున్నందునే పవార్‌కు, కాంగ్రెస్‌కు మధ్య ఈ మధ్య సరైన సంబంధాలు లేకుండా పోయాయి. ఆ నాయకత్వాన్ని పవార్‌ ఆశించడమే కాదని, అందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని మహారాష్ట్ర సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని పాలకపక్ష శివసేన-బీజేపీ కూటమి మధ్య సత్సంబంధాలు లేకపోవడం వల్ల శివసేన ప్రభుత్వం నుంచి తప్పుకున్న పక్షంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఆదుకునేందుకు కూడా ఎన్‌సీపీ సిద్ధమైందని, అలాంటి పార్టీ ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆందోళనకు దిగుతుందంటేనే అసలు ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవచ్చని మహారాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు. 

ఆది నుంచి పాలకపక్షానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాన్ని సమీకరిస్తూ వచ్చిందీ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ అనే విషయం తెల్సిందే. కేంద్రంతోపాటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌ పార్టీకి భాగస్వామిగా ఎన్‌సీపీ కొనసాగినప్పటికీ శరద్‌ పవార్‌ అంటే సోనియా గాంధీకి ఎప్పుడూ అనుమానమే. మహారాష్ట్రకు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, ఇటీవల జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, ఎన్‌సీపీలు విడి విడిగానే పోటీ చేశాయి. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ఆందోళన నిర్వహించడానికి, 2017లో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు సోనియా గాంధీ ప్రతిపక్షాలను సమీకరించినప్పుడు శరద్‌ పవార్‌ హాజరయ్యారు. కానీ గత ఆగస్టులో నిర్వహించిన ప్రతిపక్షాల సమావేశానికి మాత్రం శరద్‌ పవాద్‌ హాజరు కాలేదు. ఆ తర్వాత అహ్మద్‌ పటేల్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేసినప్పుడు ఎన్‌సీపీ ఓటేయలేదు. 'కాంగ్రెస్‌ పార్టీ పెద్దన్న ఫోజు'నచ్చకనే కాంగ్రెస్‌కు శరద్‌ పవార్‌ దూరంగా ఉంటున్నారని ఆయన పార్టీ వర్గాలు చెబుతూ వచ్చాయి. 

ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీకి ప్రత్యామ్నాయ ప్రతిపక్ష కూటమికి నాయకుడు అయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవార్‌ తలపెట్టిన ర్యాలీకి ఎలా ప్రాతినిథ్యం వహించడమని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం సంధిగ్ధంలో పడింది. ర్యాలీని బహిష్కరిస్తే కీలకమైన అంశంపై ప్రతిపక్షంతో చేతులు కలపలేదనే అపవాదు వస్తుందని, పార్టీ సీనియర్‌ నాయకులను పంపిస్తే శరద్‌ పవార్‌ పాత్రను అంగీకరించినట్లు అవుతుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులను పంపించడంతోపాటు కాంగ్రెస్‌ ఆధ్వర్యాన ప్రతి జిల్లాలో ఇలాంటి ఆందోళనలు నిర్వహించడం ఉత్తమ మార్గమని కాంగ్రెస్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement