
సాక్షి, విజయవాడ: పూటకో మాట మాట్లాడే చంద్రబాబు నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. చంద్రబాబు ఆడుతున్న నాటకాల్లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఒకటని ఎద్దేవా చేశారు. ప్రజల్ని మభ్య పెట్టడంలో చంద్రబాబును మించిన వారు లేరని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కేంద్రంపై పలువురు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. వాటిపై స్పందించిన చంద్రబాబు అవిశ్వాసం వల్ల ఏం ఒరుగుతుందని మాట్లాడారు. నేడు రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని గగ్గోలు పెడుతూ కేంద్రంపై అవిశ్వాసానికి పూనుకొన్నారని మండిపడ్డారు.
రాష్ట్రాభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనిస్తోందని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రధాని మోదీ, ఇతర మంత్రుల సహాయ సహకారాలు మరువలేనివని పొగుడుతూ చంద్రబాబు గతంలో మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. నేడు అదే చంద్రబాబు పూర్తి భిన్నంగా వ్యవహరించి రాష్ట్రం పరువు బజారున పడేస్తున్నారని ధ్వజమెత్తారు. చివరికి మహానాడు తీర్మానాల్లో సైతం కేంద్రంపై ప్రశంసలు కురిపించి, ధన్యవాద తీర్మానాలు ప్రవేశపెట్టిన బాబు వైఖరి నేడు తేటతెల్లం అయిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment