సాక్షి, అమరావతి: నాయకులకు జనం కష్టసుఖాలు తెలిసుండాలనేది వైఎస్సార్‌సీపీ అభిమతం. ఈ నేపథ్యమున్న ఏ నాయకుడికైనా ప్రజలు బ్రహ్మరథం పడతారన్న పార్టీ అధినేత నమ్మకం అక్షరాల రుజువైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అతి సామాన్యులు రాజకీయ దిగ్గజాలను ఢీ కొట్టారు. అంగ, అర్థ బలం ఉన్నవారిని సైతం అతి సామాన్య అభ్యర్థులు మట్టి కరిపించారు.
- అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన తలారి రంగయ్య ఓ ప్రభుత్వోద్యోగి. డీఆర్‌డీఏలో పీడీగా పనిచేశారు. బీసీలకు పెద్దపీట వేయాలన్న వైఎస్ జగన్ ఆశయంతో ఉత్తేజితుడై ఎన్నికల్లోకొచ్చారు. టీడీపీ నేత జేసీ తనయుడు పవన్‌ను ఓడించారు.
- గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన నందిగం సురేష్ ఓ సాధారణ కార్యకర్త. టీడీపీ సిట్టింగ్ ఎంపీ మాల్యాద్రిని ఈ ఎన్నికల్లో ఓడించారు.
- అరకు ఎంపీగా పోటీ చేసిన గొడ్డేటి మాధవి ఓ సాధారణ గిరిజన మహిళ. ప్రత్యర్థిగా బరిలో ఉన్న కిశోర్ చంద్రదేవ్ రాజవంశీకుడు. కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి. అయినా మాధవి ప్రజాభిమానం పొందింది.
- హిందూపురం ఎంపీగా వైఎస్సార్‌సీపీ తరఫున నిలిచిన గోరంట్ల మాధవ్ పోలీసు ఉద్యోగి. ప్రజాసేవ ద్వారానే ఫ్యాక్షన్ మూలాలు పెకిలించాలని భావించిన మాధవ్.. హిందూపురంలో ప్రత్యర్థి నిమ్మల కిష్టప్పను మట్టి కరిపించారు.
- చిత్తూరు పార్లమెంట్ స్థానం వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసిన రెడ్డప్ప సైతం ఓ సాధారణ కార్యకర్తే. ఆయన ఎన్ శివప్రసాద్‌పై గెలుపొందారు.
- ఎచ్చెర్లలో సాధారణ కార్యకర్త గొర్లె కిరణ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావును ఓడించారు. పలాసలో ఓ సాధారణ వైద్యుడు అప్పలరాజు అధికార పార్టీ అభ్యర్థిని చిత్తు చేశారు.
- విజయనగరం జిల్లా ఎస్ కోటలో టీడీపీ కంచుకోటను రాజకీయాలకే కొత్త అయిన వైసీపీ అభ్యర్థి కలిదిండి శ్రీనివాస్ బద్దలు కొట్టారు. ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి కోళ్ల అప్పలనాయుడు ఏడుసార్లు, ఆయన కోడలు లలితకుమారి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ చరిత్రను శ్రీనివాస్ తిరగరాశారు.
- వైఎస్సార్‌సీపీలో సామాన్య నేతలైన పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం అభ్యర్థి ముప్పిడి వెంకట్రావ్, కృష్ణా జిల్లా పామర్రు అభ్యర్థి కైలే అనిల్‌కుమార్ ఘనమైన విజయం సాధించారు. కర్నూల్ జిల్లా నందికొట్కూర్‌లో మాజీ పోలీసు ఉద్యోగి ఆర్థర్ అధికార పార్టీని మట్టి కరిపించారు.
- ఇక రాజకీయ అనుభవం లేని అబ్బయ్య చౌదరి దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌పై గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment