
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ ‘మారణహోమం’పై ప్రధాని మోదీతోపాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఎందుకు నోరు మెదపడం లేదని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారంతా భారతీయులేనని, ఇప్పటికైనా బాధిత కుటుంబాలను పరామర్శించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు చేసిన ప్రకటన వల్లే ఇదంతా జరిగిందని ఆరోపించారు. ఆదివారం దారుస్సలాంలో జరిగిన పార్టీ 62వ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ హింసాకాండపై ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు మౌనం వహిస్తున్నాయని.. నితీశ్‌కుమార్, రామ్‌విలాస్ పాశ్వాన్, అకాలీదళ్ హింసపై ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని ప్రశ్నించారు. ఢిల్లీ అల్లర్ల బాధితులకు మజ్లిస్ పార్టీకి చెందిన పార్లమెంట్, అసెంబ్లీ, మున్సిపల్ ప్రజాప్రతినిధుల ఒక నెల జీతం విరాళంగా ఇస్తున్నట్లు అసదుద్దీన్ ప్రకటించారు. ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితికి కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఎన్‌పీఆర్‌పై స్టే విధించాలి..
అసెంబ్లీ సమావేశాల్లో ఎన్‌పీఆర్‌పై స్టే విధించేలా ఒత్తిడి తెస్తామని అసదుద్దీన్ వెల్లడించారు. సీఏఏకు వ్యతిరేక తీర్మానం మాదిరిగా ఎన్‌పీఆర్‌పై స్టే విధించాలని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విజ్ఞప్తి చేశారు. కేరళ మాదిరిగా ఎన్‌పీఆర్‌పై నిర్ణయం తీసుకుంటేనే భవిష్యత్‌లో దాని ప్రక్రియ ఆగుతుందని తేల్చిచెప్పారు. ఈ బహిరంగ సభలో పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, పార్టీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.