
సాక్షి, అమరావతి: విశాఖపట్నం టీడీపీలో తీవ్ర కలకలం చోటుచేసుంది. టీడీపీలోకి కొత్తగా వచ్చే వారికి ఎంపీ సీట్లు కేటాయిస్తామని చెప్పడంపై మంత్రి అయ్యనపాత్రుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశం జరుగుతున్న సమయంలోనే అయ్యన్న బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత సీఎం నుంచి ఫోన్ వచ్చిన అయ్యన్న లిఫ్ట్ చేయలేదు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధిష్టానంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీలు మార్చి వచ్చిన వారికే పదవులు ఇస్తే.. పార్టీని నమ్ముకున్న వారి పరిస్థితి ఎంటని టీడీపీ అధిష్టానాన్ని అయ్యన్న ప్రశ్నిస్తున్నారు. పార్టీని నమ్ముకుని ఉన్నవారికే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీలు మరి వచ్చిన వారు పదవులు అనుభవించి వెళ్లిపోతే.. పార్టీ కోసం కష్టపడిన వారి పరిస్థితి ఎమిటని నిలదీశారు. కొత్తగా వచ్చినవారి కోసం గతంలో ఎంపీ సీటు వదిలేసుకున్నామని గుర్తుచేశారు. ఈ సారి కూడా అలాంటి వారికే ఎంపీ సీటు ఇస్తామంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు.