
మాట్లాడుతున్న మంత్రి అయ్యన్న
పత్రికల్లో వచ్చిన కథనాలపై దుర్భాషలకు దిగారు. వాస్తవాలను తెలుసుకోకుండా ఎన్నడూ లేని విధంగా పరుష పదజాలంతో సాక్షి విలేకరిపై విరుచుకుపడ్డారు.
విశాఖపట్నం, నర్సీపట్నం: రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు విచక్షణ కోల్పోయారు. తాను అమాత్యుడిని అనే విషయాన్ని మరిచిపోయారు. పత్రికల్లో వచ్చిన కథనాలపై దుర్భాషలకు దిగారు. వాస్తవాలను తెలుసుకోకుండా ఎన్నడూ లేని విధంగా పరుష పదజాలంతో సాక్షి విలేకరిపై విరుచుకుపడ్డారు. గురువారం ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. రూ.కోట్ల నిధులతో అభివృద్ధి చేసినా అప్‌గ్రేడ్ రాలేదని వచ్చిన వార్తకు, తన చేతకాని తననాన్ని కప్పించుకునేందుకు వార్త రాసిన విలేకరిపై దుర్భాషలాడారు. తరచూ మంత్రి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. నియోజకవర్గంలో జరిగే అభివృధ్ధి విషయంలో కానీ...పనులు చేపట్టే అంశంలోనూ వాస్తవానికి విరుద్ధంగా వార్తలు వస్తే మంత్రి తట్టుకోలేకపోతున్న విషయం అందరికీ తెలిసిందే.
వాస్తవాలను కప్పిపుచ్చేందుకు సదరు మంత్రి సమావేశాలు, బహిరంగ సభల్లోనూ విలేకరులపై రుసరుసలాడం ఆనవాయితీగా మారింది. మొదట విడతగా జిల్లాలోని ఐదు ఆస్పత్రుల హోదాపెంచుతూ ప్ర భుత్వం ఈ నెల 15న జీవోను జారీ చేసింది. ఈ జాబితాలో నర్సీపట్నం ఏరి యా ఆస్పత్రికి చోటు దక్కలేదు. ఇదే విషయాన్ని ఈ నెల 16న సాక్షిలో ‘అయ్యన్నా..ఆస్పత్రికి ఏదీ గుర్తింపు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో ఈ నెల 20న ప్రభుత్వం విడుదల చేసిన రెండో జాబితాలో ఏరియా ఆస్పత్రికి హోదా కల్పిస్తూ జీవో జారీ అయింది. ఈ విషయం తెలుసుకోని మంత్రి హోదా ఉత్తర్వులు వచ్చినా రాలేదంటూ వార్త రాశారంటూ సాక్షి దినపత్రిక విలేకరిపై దుర్భాషలకు దిగారు. జీవో వచ్చాక వార్త రాశారో...రాకముందు రాశారో అన్నది సీనియర్ మంత్రిగా చెప్పుకునే ఈయనకు కనీస అవగాహన లేకపోవటం దురదృష్టకరం.
మంత్రి వ్యాఖ్యలపై జర్నలిస్టుల నిరసన
పాత్రికేయల పట్ల దూషణలకు దిగడం మంత్రి అయ్యన్నపాత్రుడు స్థాయికి తగిన పని కాదని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు పసుపులేటి రాము, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ అధ్యక్షుడు సీహెచ్‌బీఎల్ స్వామి, ఐజేయూ కౌన్సిల్ సభ్యుడు కె.రామకృష్ణ పేర్కొన్నారు. తరుచూ పత్రికలు, వ్యతిరేక వార్తలు రాసిన విలేకరుల పట్ల తీవ్రస్థాయిలో దూషణలు చేయడం అలవాటుగా మారిందన్నారు. మంత్రి పట్ల గౌరవంతో భరిస్తూ వస్తున్నామన్నారు. దళితుడైన సాక్షి విలేకరిని పదే పదే దూషించడం అవమానకరంగా భావిస్తున్నామన్నారు. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.