
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో భావ సారూప్య శక్తులు, గ్రూపులతో కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామంటూ బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 300 సీట్లు గెలవడం ఖాయమన్నారు. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరేందుకు చాలా మంది నేతలు ఉత్సుకతో ఉన్నారని.. పార్టీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఓవైపు టీఆర్‌ఎస్ గ్రాఫ్ పడిపోతోంటే.. మరోవైపు ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ మాత్రం పగటి కలలు కంటున్నారని దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. కాగా ఆందోల్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ టీఆర్‌ఎస్‌ను వీడి శనివారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. (చదవండి : టీఆర్‌ఎస్‌కు షాక్.. బీజేపీలో చేరిన బాబుమోహన్!)
రావణ కాష్టంగా ఉంచాలనుకుంటున్నారా?
అయోధ్య అంశాన్ని రావణ కాష్టంలా ఉంచాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భావిస్తున్నారని దత్తాత్రేయ ఆరోపించారు. ట్రిపుల్ తలాఖ్ ఆర్డినెన్స్‌ను రాజ్యాంగ విరుద్దమని ఒవైసీ చెప్పడం సరికాదన్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆయన ఇలా మాట్లాడుతున్నారని దత్తాత్రేయ విమర్శంచారు. ఇదిలా ఉంటే.. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయం కోసం ప్రధాని నరేంద్ర మోదీని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారని దత్తాత్రేయ ఆరోపించారు. చంద్రబాబు అవినీతి శక్తులతో కలిసి ఎందుకు పనిచేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment