సాక్షి, న్యూఢిల్లీ: పకోడా (అలియాస్ పకోడీలు) అమ్ముకోవడం కూడా ఉద్యోగం లాంటిదేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన అనంతరం తొలిసారి పెద్దల సభలో మాట్లాడిన అమిత్ షా కూడా తాజాగా ‘పకోడా’మాట ఎత్తారు. నిరుద్యోగులుగా ఉండటం కంటే పకోడాలు అమ్ముకోవడం మంచిదేనని అమిత్ షా అన్నారు.
‘నిరుద్యోగిగా ఉండటం కంటే కార్మికులుగా పనిచేయడం లేదా, పకోడాలు అమ్ముకోవడం మంచిదే. పకోడాలు అమ్ముకోవడంలో సిగ్గుపడటానికి ఏమీ లేదు’ అని అమిత్ షా అన్నారు. సభలో కూర్చున్న ప్రధాని మోదీకి కొద్దిదూరంలో నిలబడి షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రధాని మోదీ.. ‘ఒక వ్యక్తి పకోడాలు అమ్ముతూ.. రోజుకు రూ.200 సంపాదించుకొని ఇంటికి వెళితే.. అతన్ని నిరుద్యోగిగా పరిగణించలేం కదా’ అని పేర్కొన్న సంగతి తెలిసిందే.
ప్రధాని మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఉద్యోగాల కల్పనపై మోదీ విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది. పకోడాలు అమ్మడం కూడా ఉద్యోగమే అయితే.. భిక్షాటనను కూడా ఉద్యోగంగానే చూడాలని పేర్కొంది. ప్రధాని మోదీ హయాంలో అసలు ఉద్యోగాల కల్పన అన్న ముచ్చటే లేదని కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలను సమర్థిస్తూ షా వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment