జనంలోకి అడుగులు | BJD party ready to to padayatra | Sakshi
Sakshi News home page

జనంలోకి అడుగులు

Published Wed, Sep 27 2017 2:48 AM | Last Updated on Wed, Sep 27 2017 2:48 AM

BJD party ready to   to padayatra

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుని పర్యటనలు ముమ్మరమవుతున్నాయి. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కేంద్రం విడుదల చేస్తున్న నిధుల చిట్టా బహిరంగ సభల్లో ఆయన తెలియజేస్తున్నారు. రాష్ట్రానికి మంజూరైన నిధుల వినియోగం పట్ల లెక్కలపై నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏటా నిర్వహించే పాదయాత్రకు బీజేడీ కసరత్తు చేస్తోంది.  పాదయాత్రలో ప్రజలతో మమేకమై కేంద్రం వివక్షను వివరించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని భావిస్తోంది.

భువనేశ్వర్‌: రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు వివరించి వైఫల్యాల్ని ప్రతిపక్షాల నెత్తిన రుద్దే రీతిలో అధికార పక్షం బిజూ జనతా దళ్‌ ఏటా పాదయాత్ర నిర్వహిస్తోంది. ఏటా మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు  2వ తేదీ నుంచి ఈ యాత్రను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు. లోక్‌నాయక్‌ దివంగత జయ ప్రకాష్‌ నారాయణ్‌ జయంతి అక్టోబరు 11వ తేదీ వరకు బీజేడీ పాదయాత్ర నిరవధికంగా కొనసాగుతుంది.  ఈ ఏడాది ప్రారంభించనున్న పాదయాత్రను వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని బిజూ జనతా దళ్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ మేరకు మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పాదయాత్ర–2017 కార్యాచరణ, పార్టీ ప్రముఖుల నుంచి క్షేత్ర స్థాయి ప్రజా ప్రతినిధులు, కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పాదయాత్రలో ప్రజల మనోగతాల్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని నవీన్‌ పట్నాయక్‌ సందేశం జారీ చేశారు. రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్షపై ప్రజల్లో పూర్తి విశ్వాసాన్ని బలోపేతం చేసే రీతిలో బీజేడీలోని  ప్రతి ఒక్కరూ  కృషిచేయాలని కోరారు.

బీజేపీ తీరును ఎండగట్టండి
 పలు  ప్రజాకర్షణ పథకాలకు కేంద్ర ప్రభుత్వం కుదించిన నిధుల మంజూరు విషయంలో ప్రజలకు గణాంకాల్ని స్పష్టంగా వివరించడం అనివార్యమని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రతిపాదనకు తుంగలో తొక్కి రాష్ట్ర  ప్రయోజనాలకు కేంద్రం నీళ్లొదిలిందని తెలియజేయాలని సూచించారు. రాష్ట్ర జీవన రేఖగా పొంగి పొరలే మహానది జలాలు మన రాష్ట్రానికి ప్రవహించకుండా ఎగువ ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి కొమ్ముగాస్తున్న వైనాన్ని వివరించాలని తెలియజేశారు. పొరుగు రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పురోగతికి ప్రోత్సహించి ఒడిశాకు అన్యాయం చేస్తున్న ఉద్దేశపూర్వక చర్యలపట్ల రాష్ట్ర ప్రజలకు వివరించి  భారతీయ జనతా పార్టీ తీరుపట్ల  ఎండగట్టాలని పార్టీ అధ్యక్షుడు పిలుపునిచ్చారు.

క్షేత్ర స్థాయికి వెళ్లండి
పాదయాత్రను పురస్కరించుకుని పార్టీ అగ్రశ్రేణి నాయకులు క్షేత్ర స్థాయిలో గ్రామీణ ప్రాంతాలకు కదలాల్సిందే. రాజధాని వీడి గ్రామీణ పంచాయతీ ప్రతినిధులు వగైరా వర్గాలతో ప్రత్యక్షంగా సంప్రదించి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో కలిసి ఈ ఏడాది పాద యాత్రను విజయవంతం చేయాలని నవీన్‌ పట్నాయక్‌ ఆదేశించారు. జిల్లా పర్యవేక్షకులు సత్వరమే ఆయా జిల్లాలకు చేరాలని స్పష్టం చేశారు. బిజూ జనతా దళ్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలు జేస్తున్న పలు ప్రజాహిత పథకాలపట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఉపదేశించారు. “అమ్మొ గాంవ్‌ – అమ్మొ బికాష్‌’, “అమ్మొ సొహొరొ–అమొరొ ఉన్నతి’ వంటి అత్యాధునిక బీజేడీ ప్రజాహిత పథకాలపట్ల ప్రజల్ని చైతన్యపరిస్తే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వాస్తవ కార్యాచరణ ఏమిటో సామాన్యునికి సులభంగా అర్థమవుతుందని పార్టీ ప్రముఖులు సూచించారు. పాదయాత్రలో విశేష సంఖ్యలో విద్యార్థులు, యువజనం, మహిళలు, యువతులు వగైరా వర్గాల నుంచి ప్రజల్ని ఏకీకృతం చేసుకుని పాదయాత్ర ఫలప్రదం చేయాలని నవీన్‌ పట్నాయక్‌ కార్యకర్తల్ని ఉత్తేజపరిచారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement