గీతా మెహతా తెరవెనుకే సారథి
♦ సీఎం నవీన్ తదుపరి వారసులు ఎవరు?
♦ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతున్న చర్చ
లోగడ..ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విదేశీ పర్యటనకు వెళ్లిన తరుణంలో ఆయనకు అత్యంత సన్నిహితుడు, రాజకీయ సలహాదా రుగా చలామణి అవుతున్న ప్యారీ మోహన్ మహాపాత్రో అర్ధరాత్రి ఆపరేషన్ నిర్వహించి రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళం సృష్టించారు. ప్రస్తుతం.. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార బీజేడీ డీలాపడింది. అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ బలం పుంజు కుంది.
ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ ఆరోగ్య స్థితి మెరుగు కోసం విదేశీ పర్యటనకు యోచిస్తున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి గందరగోళ పరిస్థితి ఏర్పడకుండా అధికార బీజేడీ పార్టీ వ్యవహారాల్ని పటిష్టంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రణాళిక వేస్తున్నారు. సోదరి గీతా మెహతాను ఆయన ప్రతినిధిగా నియమిస్తారని రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతోంది. అయితే ఈ చర్చ అంతా సీఎం బహిరంగ ప్రకటనతో తుస్సుమంది.
భువనేశ్వర్: పంచాయతీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయ చర్చలు బలం పుంజుకున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాన రాజకీయ పార్టీల భావి స్థితిగతులపట్ల విశ్లేషణలు అలా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ కుమార్తె, వర్ధమాన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి గీతా మెహతా రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రంగ ప్రవేశం చేయనున్నట్లు చర్చ ఊపందుకుంది. ఆమె నవీన్ పట్నాయక్ తర్వాత రాష్ట్రంలో బిజూ జనతా దళ్‌కు సారథ్యం వహిస్తారని రాజకీయ శిబిరాల్లో ప్రధాన చర్చనీయాంశమైంది. రాజకీయ గణాంకాలు, విశ్లేషణలతో రాష్ట్ర రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ మరో వారసురాలు అడుగిడుగుతుందనే నమ్మకం దాదాపు స్థిరపడిన క్షణంలో అంతా తుస్సుమంది.
బీజేడీలో కేంద్ర శక్తి గీతా మెహతా
రాష్ట్రంలో అధికార పక్షం బిజూ జనతా దళ్ పార్టీలో గీతా మెహతా ప్రముఖ పాత్రధారిగా నిలుస్తారనే చర్చ ఇటీవల కాలంలో ఊపందుకుంది. పార్టీ అంతరంగిక వ్యవహారాలతో పాటు నవీన్ పట్నాయక్ తర్వాత ఆమె రాష్ట్ర రాజకీయాల్లో పాలనాపగ్గాలు చేపడతారనే ఊహాగానాలు భారీగా ఊపందుకున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఫలితాలు దిగజారిన సందర్భంగా ప్రత్యక్ష రాజకీయాల్లో విశ్వసనీయ వ్యక్తిగా తన సోదరిని నవీన్ పట్నాయక్ రంగంలోకి దించుతున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. వ్యూహాత్మక కార్యాచరణలో నవీన్‌కు సాటి ఎవరూ లేరని అంతా విశ్వసిస్తారు. ఈ క్రమంలో చర్చ ఇలా సాగుతోంది.
తొలుత రాజ్యసభ
రాష్ట్ర రాజకీయాల్లోకి గీతా మెహతాను దింపేందుకు రంగం సిద్ధం అయింది. ఇంత వరకు పార్టీ ప్రధాన శిబిరంలో తెర వెనక ఉంటూ పంచాయతీ ఎన్నికల విశ్లేషణ, సమీక్షలు నిర్వహించిన సోదరికి నవీన్ పట్నాయక్ పట్టం గడతారు. రాష్ట్రంలో బిజూ జనతా దళ్ సంఖ్యా బలాన్ని అనుకూలంగా మలుచుకుని సోదరిని ప్రతిష్టాత్మక పదవితో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించుతారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ రేసులో ఉన్న బిష్ణు దాసును తప్పించి రాష్ట్ర ప్రణాళిక బోర్డు డిప్యుటీ చైర్మన్‌గా నియమించారు. దీంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఆయన సోదరి గీతా మెహతాను సిఫారసు చేయించి ప్రత్యక్ష రాజకీయాల నుంచి నవీన్ పట్నాయక్ అంచెలంచెలుగా తప్పుకునేందుకు పావులు కదుపుతున్నట్లు రాజకీయ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
బీజేడీ శిబిరంలో ఉత్సాహం
దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ వారసులు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్ర పోషించడంపట్ల బిజూ జనతా దళ్ శిబిరం నుంచి సానుకూల పవనాలు వేగం పుంజుకున్నాయి. ఆరోగ్య పరీక్షల కోసం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దీర్ఘకాలం విదేశీ పర్యటనకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయన గైర్హాజరులో రాష్ట్రంలో పార్టీ వ్యవహారాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు విశ్వసనీయమైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ జాబితాలో ఆయన సోదరి గీతా మెహతా ఏకైక వ్యక్తిగా పేరు వినిపించింది. గీతా మెహతా పార్టీ వ్యవహారాల్ని చేపట్టి ప్రత్యక్షంగా రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగిడితే అంతా మేలు జరుగుతుందని బీజేడీ శ్రేణులు సానుకూలంగా స్పందించాయి. ప్రధానంగా పార్టీ సీనియర్ వర్గం ఆమె ప్రవేశంపట్ల అమితానందం ప్రదర్శించింది.
రాజకీయ పదవులపట్ల అనాసక్తి
సోదరి గీతా మెహతాకు ఎటువంటి రాజకీయ పదవులు, హోదాపట్ల ఆసక్తి లేనట్లు నవీన్ పట్నాయక్ సోమవారం బహిరంగంగా ప్రకటించారు.ఆయన తాజా ప్రకటనతో గీతా రాజకీయ ప్రవేశానికి తెరపడింది. రాజ్యసభ లేదా ఇతర రాజకీయ పదవులపట్ల ఆమె ఎటువంటి ఆసక్తి కనబరచడం లేదని ముఖ్యమంత్రి సూటిగా బహిరంగపరిచారు.