
బీజేపీ టికెట్ ఆశిస్తున్న లీలా శివకుమార్,కాంగ్రెస్ అభ్యర్థి దినేశ్‌గుండూరావ్
జయనగర : గాంధీనగర నియోజకవర్గంలో గత నాలుగు ఎన్నికల్లో వరుసగా విజయం సాధిస్తున్న కేపీసీసీ కార్యాధ్యక్షుడు దినేశ్ గుండూరావ్ గెలుపు అడ్డుకట్ట వేయడానికి బీజేపీ, జేడీఎస్ పార్టీలు వ్యూహాలు పన్నుతున్నారు. గత రెండు ఎన్నికల్లో దినేశ్ గుండూరావ్ ప్రత్యర్థిగా పోటీ చేసిన పీసీ.మోహన్ ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి బరిలోకి దిగడానికి పలువురు టికెట్లు కోసం పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి నగర కార్యదర్శి ఎస్.నరేశ్‌కుమార్, చిక్కపేటే కార్పోరేటర్ లీలా శివకుమార్, ఆమె భర్త ఎల్.శివకుమార్, మాజీ ఎంఎల్‌సీ రామచంద్రేగౌడ కుమారుడు సప్తగిరిగౌడ, విశ్రాంత ఏసీసీ గంగాధర్, మాజీ కార్పోరేటర్ గోపాలకృష్ణ పేర్లు వినబడతున్నాయి. ఇక జేడీఎస్ పార్టీనుంచి సర్వోదయ నారాయణస్వామి టికెట్ రేసులో ఉండగా ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తమిళ ఓటర్లు కలిగిన గాంధీనగరలో ఈసారి ఏడీఎంకే పార్టీ నుంచి అభ్యర్థి బరిలోకి దిగే అవకాశం ఉంది. బెంగళూరు సెంట్రల్ లోకసభ నియోజకవర్గంలో బీజేపీ గెలుపొందగా నియోజకవర్గ పరిధిలో ఐదుగురు కాంగ్రెస్, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. గాంధీనగర నియోజకవర్గంలో చాలాప్రదేశాలు వాణిజ్య కేంద్రాలుగా ఉన్నాయి.
ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే గాంధీనగర, ఓకళిపుర, సుభాష్‌నగర, కాటన్‌పేటే మురికివాడ ప్రాంతాలు ఉన్నాయి, అన్నిమతాలకు చెందిన ఓటర్లు గాంధీనగర నియోజకవర్గంలో ఉన్నారు. గాంధీనగర నియోజకవర్గం ఏర్పడినప్పటికీ అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ గత ఏడాది కురిసిన భారీవర్షాలకు ఆనందరావ్ రైల్వేఅండర్‌పాస్ వద్ద వర్షం నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మెజస్టిక్ వరకు ట్రాఫిక్‌సమస్య తలెత్తుతోంది. ఓకళిపుర జంక్షన్‌లో మల్లేశ్వరం, మెజస్టిక్, మాగడిరోడ్డుకు అనుసంధానంగా భారీ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులు గత ఐదేళ్లుగా జరుగుతున్నాయి. ఇటీవల టెండర్‌ష్యూర్ పథకం కింద కొన్ని రోడ్లు అభివృద్ధి చేపట్టారు. రాష్ట్రంలో అత్యంత పాత నియోజకవర్గంగా ఉన్న గాంధీనగర ను ఆదర్శనియోజకవర్గంగా తీర్చిదిద్దాలని డిమాండ్ ప్రజల్లో నెలకొంది. గాంధీనగర నియోజకవర్గ పరిధిలో 7 వార్డులు ఉండగా అందులో 5 వార్డుల్లో కాంగ్రెస్ కార్పోరేటర్లు ప్రాతినిథ్యం వహిస్తుండగా, రెండు వార్డుల్లో బీజేపీ కార్పోరేటర్లు గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,23,224 ఓట్లు కాగా పురుష ఓటర్లు 1,16,240, మహిళాఓటర్లు 1,06,978 ఓట్లు ఉన్నారు. కెంపేగౌడ బస్టాండు, కర్ణాటక ప్రజల ఆరాధ్యదైవం అణ్ణమ్మదేవి ఆలయం ఇక్కడే ఉంది.