అసమర్థ ప్రభుత్వం మీది కాదా? | BJP AP Chief Kanna Laxminarayana Slams Chandrababu Through Letter | Sakshi
Sakshi News home page

పదోసారి బాబుకు కన్నా లేఖాస్త్రం

Published Wed, Sep 5 2018 12:09 PM | Last Updated on Wed, Sep 5 2018 12:45 PM

BJP AP Chief Kanna Laxminarayana Slams Chandrababu Through Letter - Sakshi

కన్నా లక్ష్మీ నారాయణ

గుంటూరు: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి మరోసారి బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖాస్త్రం సంధించారు. పదోసారి మరో ఐదు ప్రశ్నలు సంధించారు. ఇలా మొత్తం ఇప్పటి వరకు పంపిన 50 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని లేఖ ద్వారా డిమాండ్‌ చేశారు.

ఆ ప్రశ్నలు ఇవే..

ప్రశ్న నెంబర్‌ 46: మీ ఎలక్షన్‌ మేనిఫెస్టోలో అవినీతి రహిత, సుపరిపాలనను అందిస్తామని వాగ్దానం చేశారు. ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి ‘మా ప్రజా ప్రతినిధులు గానీ, మా నాయకులు గానీ చేసిన ఒక్క అవినీతి పనినైనా చెప్పగలరా’ అని ప్రజలను అడిగే ధైర్యం ఉందా? మీ ఎంఎల్‌ఏ, ఎంపీ, ఎంఎల్‌సీల అవినీతి అరాచకాలపై ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమా? సీబీఐ విచారణకు సిద్ధమా?

ప్రశ్న నెంబర్‌ 47: ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మొదట ర్యాంక్‌ వచ్చిందని చెబుతున్నారు కదా! ఈ నాలుగు సంవత్సరాలలో మీ పచ్చ నాయకులు, ప్రజా ప్రతినిధులు తమవి గానీ తమకు సంబంధించినవి గానీ ఎన్ని పరిశ్రమలను, వ్యాపారాలను ఇతర రాష్ట్రాలలో పెట్టారు? మన రాష్ట్రంలో ఎన్ని పెట్టారు? నిజాయతీగా ప్రజలకు చెప్పగలరా?

ప్రశ్న నెంబర్‌ 48: బీజేపీ మీద కోపంతో బ్యాంకింగ్‌ వ్యవస్థను కుప్పకూల్చాలని ప్రయత్నించడం లేదా? తద్వారా కోట్లాది ప్రజలను గందరగోళంలోకి నెట్టాలని చూడటం లేదా? డిమానిటైజేషన్‌, డిజిటల్‌ కరెన్సీని బహిరంగంగా బలపరచి, ఈ మధ్య కాలంలో కావాలని కుట్రపూరితంగా బ్యాంకింగ్‌ వ్యవస్థ మీద బాధ్యతారాహిత్య ప్రకటనలను చేస్తూ ప్రజలలో లేనిపోని అనుమానాలు లేవనెత్తుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం లేదా?. రాజ్యంగపదవిలో ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడు చేయవలసిన పనేనా ఇది? మీ కుట్రపూరిత ప్రకటనల వల్ల ఒక్కసారిగా బ్యాంకింగ్‌ వ్యవస్థ, ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలితే ఈ దేశం, ప్రజలు ఏమి కావాలి.. మీ స్వార్థం కోసం ద్రోహం చేయవచ్చా?

ప్రశ్న నెంబర్‌ 49: వెనకబడిన జిల్లాల అభివృద్ధికి అహర్నిశలూ పాటుబడుతున్నామని చెప్పే మీరు వెనకబడిన విజయనగరం జిల్లా అభివృద్ధిని తుంగలో తొక్కలేదా? సాగునీటికి తాగునీటికి ఎంతో ముఖ్యమైన  తారక రామ తీర్థ సాగర్‌ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు అటక ఎక్కిన వాస్తవం కాదా?. తోటపల్లి రిజర్వాయర్‌ ఫీల్డ్‌ చానల్స్‌ను పూర్తి చేయలేదు. వెంగళరావు సాగర్‌ అదనపు ఆయకట్టు పెంపుదల పక్కన పెట్టేశారు. మీ మేనిఫెస్టోలో పెట్టిన సాలూరు బైపాస్‌ను మర్చిపోయారు. జిల్లాలోని జూట్‌ మిల్లులను తెరిపించడంతో విఫలమై 10 వేల మంది కార్మికుల భవితవ్యాన్ని చీకట్లోకి నెట్టేసిన ఘనత మీది కాదా? వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు మీకుందా?

ప్రశ్న నెంబర్‌ 50: ఎంతో వెనకబడిన ప్రకాశం, వైఎస్సార్‌ జిల్లాలకు వరప్రసాదిని అయిన వెలుగొండ ప్రాజెక్టు ఈరోజుకీ పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం మీది కాదా? 4.59 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించే అత్యంత ప్రాధాన్యత గల ఈ ప్రాజెక్టునే పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు ఉందా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement