పొత్తులు, సీట్ల కేటాయింపు, అభ్యర్థులపై మోదీ, నడ్డా, అమిత్‌షాలకు తొమ్మిది మంది ఏపీ బీజేపీ నేతలు లేఖాస్త్రం
ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్
తాము కూటమికి వ్యతిరేకం కాదంటూ స్పష్టీకరణ
కానీ, టీడీపీ గెలవని సీట్లే పొత్తులో మనకిచ్చారంటూ వెల్లడి
ఆ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక సైతం పూర్తిగా టీడీపీకి అనుకూలంగా ఉండేలా ఉంది.. ఈ చర్యలు పార్టీని బలోపేతం చేసుకునేలా లేవు
లేఖ రాసిన వారంతా ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గంలో సీనియర్ నేతలే
సాక్షి, అమరావతి: పొత్తుల పేరుతో తెలుగుదేశం పార్టీ మరోసారి బీజేపీకి వెన్నుపోటు పొడుస్తోందని ఏపీ బీజేపీలోని పలువురు సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా ఓడిపోయే సీట్లనే పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిందని వారు ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర కమలదళంలో చాలా కాలంగా కొనసాగుతూ, ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న సీనియర్లు కొందరు రెండు రోజుల క్రితం పార్టీ జాతీయ నాయకత్వానికి లేఖ రాసి అందులో వివిధ అంశాలను వివరించారు.
పొత్తులో భాగంగా ఎక్కువచోట్ల మొదట నుంచి పార్టీలో కొనసాగుతున్న వ్యక్తులకు కాకుండా 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలోకి వలస వచ్చిన వారికే టికెట్లు దక్కేలా పార్టీ రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి నివేదికలు సమర్పించడాన్ని వ్యతిరేకిస్తూ వీరు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. అనంతరం వీరు పొత్తు సందర్భంగా తమ దృష్టికొచ్చిన అంశాలను పేర్కొంటూ గురువారం జాతీయ నాయకత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖ ప్రతులు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్. దయాకర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు, రాష్ట్ర కార్యదర్శి కె. సురేంద్రమోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ, బీజేపీ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యురాలు కె. శాంతారెడ్డి, బీజేపీ సీనియర్ నేత జూపూడి రంగరాజు, మహిళా మోర్చా జాతీయ మాజీ కార్యదర్శి మాలతీరాణి ఆ లేఖలో సంతకాలు చేశారు.
పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను ఉద్దేశిస్తూ రాసిన ఆ లేఖ నకళ్లను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్, కేంద్ర పార్లమెంటరీ పార్టీ బోర్డు సభ్యులు లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, రాష్ట్ర పార్టీ సంస్థాగత వ్యవహరాలు పర్యవేక్షించే సంఘటనా కార్యదర్శి మధుకర్, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజుకు కూడా పంపారు.
పొత్తులకు వ్యతిరేకం కాదు, కానీ..
నిజానికి.. కేంద్ర నాయకత్వంపై తమకు చాలా నమ్మకం ఉందని.. పొత్తు నిర్ణయాన్ని తామేమీ వ్యతిరేకించడంలేదని వారు ఆ లేఖలో స్పష్టంచేశారు. అందులో వారు ఇంకా ఏం పేర్కొన్నారంటే..
♦ తాము కూటమి ఏర్పాటుకు వ్యతిరేకం కాదు. కానీ, పొత్తుల పేరుతో జరుగుతున్న పరిణామాలతో మేం విభేదిస్తున్నాం.
♦ పొత్తులో బీజేపీకి కేటాయించిన ఆరు లోక్‌సభ, పది అసెంబ్లీ స్థానాలను బీజేపీనే కాదు టీడీపీ కూడా గెలిచే అవకాశంలేదు.
♦ బీజేపీకి కేటాయించిన సీట్లలో గతంలో టీడీపీ గెలవలేదు. అంత బలహీనమైన అసెంబ్లీ సీట్లు మన పార్టీకి ఇచ్చారు.
♦ బీజేపీకి కేటాయించిన ఈ సీట్లు పరిశీలిస్తే టీడీపీ మరో విడత మన పార్టీకి వెన్నుపోటు పొడుస్తోందన్న అభిప్రాయమే కనిపిస్తోంది.
♦ పొత్తులో పార్టీకి కేటాయించిన సీట్లలోనూ అనేక దశాబ్దాలుగా పార్టీ భావజాలంతో పనిచేసి, గెలిచే అవకాశాలున్న అభ్యర్థుల పేర్లను రాష్ట్ర నాయకత్వం పరిగణనలోకి తీసుకోలేదు.
♦ బీజేపీ సీట్లకు అభ్యర్థుల పరిశీలనలో సైతం టీడీపీ ప్రభావమే ఎక్కువగా ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
♦ టీడీపీ మన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ముందస్తు ఎజెండాతోనే ఆ పార్టీ నేతలను మన బీజేపీలోకి బదలాయించింది. తద్వారా ఇప్పుడు ఆ పార్టీ తమ నాయకులను సంతృప్తపరచడంతో పాటు మొదట నుంచి బీజేపీలో కొనసాగే నేతలను కూడా దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు.
♦ కాబట్టి పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మా విజ్ఞప్తిని దయతో పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం.
పార్టీ అసలైన నేతలకే సీట్లు దక్కేలా చూడాలి..
నిజానికి.. బాధ్యతాయుతమైన పార్టీ నాయకులుగా పార్టీ నిర్ణయాన్ని మేం వ్యతిరేకించడంలేదు. అయితే, గతంలో మనకున్న చేదు అనుభవాల దృష్ట్యా.. భవిష్యత్తులో మన పార్టీని పటిష్టం చేసేందుకు సుదీర్ఘ కాలంగా పార్టీలో కొనసాగుతున్న హార్డ్‌కోర్ నాయకులకే అత్యధిక సీట్లు దక్కేలా చూడాలని మేం అభ్యర్థిస్తున్నాం. రాష్ట్రంలో లక్షలాది మంది పార్టీ అభిమానులు ఇదే అభిప్రాయంతో ఉన్నారన్న విషయం అధిష్టానానికి తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ లేఖ రాసినట్లు ఆ నాయకులు తమ లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment