ఎటూ తేల్చలేక చంద్రబాబు సతమతం
బలమైన అభ్యర్థులు దొరకకపోవడమే కారణం
ఉత్తరాంధ్ర పెండింగ్ సీట్లపై డోలాయమానం
తేలని మైలవరం, పెనమలూరు పంచాయితీ
ఆలూరు, గుంతకల్లు సీట్లపైనా నాన్చుడే
టికెట్ల ఖరారులో బీజేపీ, జనసేనదీ అదే తీరు
అధికారంకోసం వెంపర్లాడుతున్న చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో అవస్థలు పడుతున్నారు. కూటమిని కూడగట్టడానికి అడ్డదారులు తొక్కి టిక్కెట్ల ఖరారులో విఫలమయ్యారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా ఇప్పటికీ 16 స్థానాల్లో సరైన వ్యక్తులు దొరక్క సతమతమవుతున్నారు.
ఇప్పటికే తాము గెలవలే మని నిర్ణయించు కున్న స్థానాలు మిత్ర ధర్మం అంటూ జనసేన, బీజేపీకి అప్పగించిన ఆయన సొంత స్థానాలకు వచ్చేసరికి చతికిలబడుతున్నారు. రకరకాల సర్వేల పేరుతో నాన్చుడు ధోరణి అవలంబిస్తూ... ఆశావహులను డోలాయమానంలో పడేస్తున్నారు.
సాక్షి, అమరావతి: పొత్తుల ఎత్తుల్లో తలమునకలైన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పెండింగ్‌లో ఉన్న 16 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో చెమటోడుస్తున్నారు. ఇన్నాళ్ల తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత ఎక్సర్‌సైజ్ చేశానంటూ రెండో విడత అభ్యర్థుల ప్రకటన సమయంలో చెప్పుకున్న ఆ ఫార్టీ ఇండస్ట్రీస్ మిగిలిన స్థానాల ప్రకటనకు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
పొత్తులో సీట్ల సర్దుబాటుపై స్పష్టత లేకపోవడం, కొన్నిచోట్ల పార్టీ బలహీనంగా ఉండడంతో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. బీజేపీ, జనసేనకు 31 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. మిగిలిన 144 స్థానాలకు 128 చోట్ల మాత్రమే ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 16 సీట్ల విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో నాలుగు సీట్లపై మల్లగుల్లాలు పడుతున్నారు.
పలాస, పాతపట్నం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం సీట్లలో టీడీపీ పోటీ చేసేవి ఏవన్న దానిపై ఇంకా సందిగ్ధం నెలకొంది. మిత్రులకు కేటాయించిన స్థానాల్లోనూ అభ్యర్థులు కరువవ్వడంతో ఆపసోపాలు పడుతున్నారు.
సీనియర్లకే దిక్కులేదు
♦ శ్రీకాకుళం, ఎచ్చెర్లలో ఒక స్థానాన్ని బీజేపీకి ఇవ్వాల్సి రావడంతో అక్కడ అభ్యర్థులను ప్రకటించలేదు. ఎచ్చెర్ల ఇన్‌ఛార్జిగా ఉన్న పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావుకు సీటు ఖరారు చేయకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆ స్థాయి నాయకుడికే దిక్కు లేకపోతే ఎలాగని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
♦ పాతపట్నం, పలాస సీట్లపై అయోమయం రాజ్యమేలుతోంది. పలాస సీటుపై మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీష గట్టిగా పట్టుబడుతున్నా ఆమెకు ఖరారు చేయలేదు. పాతపట్నం స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారు. పొత్తుల్లో పోటీ చేసే సీట్లపై పూర్తి స్పష్టత వచ్చే వరకు ఈ సీట్ల సంగతి తేలేలా కనిపించడంలేదు.
జటిలంగా మారిన చీపురుపల్లి
♦ విజయనగరం జిల్లా చీపురుపల్లి స్థానం టీడీపీకి కత్తిమీద సాములా మారింది. అక్కడ పోటీ చేసేందుకు ఆ పార్టీ తరఫున ఎవరూ ముందుకు రావడంలేదు. ఓడిపోయే సీటు కావడంతో గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు వంటి నేతలూ అక్కడకు వెళ్లడానికి ససేమిరా అంటున్నారు.
♦ ఎస్ కోట సీటు కోసం కోళ్ల లలితకుమారి, ఎన్‌ఆర్‌ఐ గొంప కృష్ణ పోటీ పడుతుండగా... పొత్తులో ఆ స్థానాన్ని వదులుకోవాల్సివస్తుందనే ఉద్దేశంతో దాన్ని పెండింగ్‌లో పెట్టారు. భీమిలిస్థానంపై గంటా పట్టుపడుతున్నా... దానిని జనసేనకు కేటాయించాల్సి ఉంటుందేమోనని దానిపైనా నానుస్తున్నారు.
సందిగ్ధంలో పెనమలూరు, మైలవరం
♦ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెనమలూరు, మైలవరం సీట్లపైనా సందిగ్ధం వీడటంలేదు. మైలవరం సీటు కోసం దేవినేని ఉమామహేశ్వరరావు గట్టిగా పట్టు పడుతుండడంతో వలస నేత వసంత కృష్ణప్రసాద్ పరిస్థితి ఇరకాటంగా మారింది. వీరిద్దరిలో ఒకరిని పెనమలూరు పంపుతారనే ప్రచారం జరుగుతుండడంతో అక్కడి ఇన్‌ఛార్జి బోడె ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
♦ నర్సరావుపేట, చీరాల, దర్శి నియోజకవర్గాల్లో సరైన నేతలు దొరకలేదు. ధన బలం ఉన్నవారికోసం అక్కడ వెదుకులాడుతున్నారు.
వెంటాడుతున్న సోమిరెడ్డి భయం
♦ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి సీటు విషయం పెండింగ్‌లో ఉంది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అక్కడ టికెట్ ఇస్తే ఓడిపోతామన్న భయం ఉంది. ఆ స్థానంలో ఆయన కుటుంబంలో ఎవరికైనా ఇవ్వాలా, బయట వ్యక్తులను చూడాలా అనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు.
♦ ఉమ్మడి కడప జిల్లా జమ్మలమడుగు, బద్వేలు సీట్లలో ఒక సీటును బీజేపీకి ఇచ్చే ఉద్దేశంతో పెండింగ్‌లో పెట్టారు. జమ్మలమడుగు సీటుపై బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి, ఆయన కుటుంబానికే చెందిన భూపే‹Ùరెడ్డి మధ్య వివాదం నెలకొంది. రైల్వేకోడూరు, రాజంపేట సీట్ల విషయంలోనూ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. పొత్తులో వీటిలో ఒకదాన్ని వదులుకోవాల్సి వస్తుందని ఒక నిర్ధారణకు రావడం లేదు.
♦ గుమ్మనూరు జయరాం టీడీపీలోకి మారడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆలూరు, గుంతకల్లు సీట్లపై అయోమయం నెలకొంది. ఆయనకు గుంతకల్లు సీటిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినా స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆలూరు అభ్యర్థి విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అనంతపురం అర్బన్ సీటు పొత్తులో పోతుందనే అంచనాతో ఆ స్థానాన్ని ఖరారు చేయలేదు. దీనిపై అక్కడి నేత ప్రభాకర్ చౌదరి ఇతరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment