
బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు, ఎంపీ హరిబాబు
సాక్షి,న్యూఢిల్లీ : విభజన చట్టంలోని హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..బీజేపీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం కమిటీ ఏర్పాటు చేశామని పోలవరం నిర్మాణానికి రూ.4వేల కోట్లు విడుదల చేసినట్లు జీవీఎల్ నరసింహరావు తెలిపారు. కడప స్టీల్‌ప్లాంట్‌పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, దుగరాజపట్నం పోర్టుపై అభ్యంతరాలను పరిశీలిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రుల గొంతు కోసిందని, రాష్ట్రానికి కాంగ్రెస్ సరైన న్యాయం చేయలేదని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి కేంద్రం సాయం చేసిందన్నారు. రాజకీయ లబ్దికోసం దుష్ప్రచారాలు చేయడం సరికాదని అన్నారు.
‘చెప్పుకోవట్లేదంటే మేము చేయనట్లు కాదు’
బీజేపీ ఏపీ అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు ఈ సందర్భంగా ఏపీకి కేంద్రం ఇప్పటివరకూ ఇచ్చిన నిధులు, మంజూరు చేసిన ప్రాజెక్టులు, సంస్థల వివరాలతో కూడిన 27 పేజీల నోట్‌ను మీడియాకు విడుదల చేశారు. విభజన హామీల అమలుకు మోదీ సర్కార్ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. హోదావల్ల వచ్చే అన్ని ప్రయోజనాలను ప్రత్యేక ప్యాకేజీలో ఇస్తామన్నారు. పోలవరం ముంపు మండలాలను ఏపీ పరిధిలోకి తెచ్చామని అన్నారు. ఏపీకి సాయం చేయడం లేదనే వార్తలు వాస్తవం కాదని అన్నారు. ఆంధ‍్రప్రదేశ్‌కు కాంగ్రెస్ సరైన న్యాయం చేయలేదని, ఇప్పుడు రాహుల్ గాంధీ మాయమాటలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఏపీ విభజన చట్టం హామీలు అమలు చేస్తామని ఆయన తెలిపారు. పదేళ్లలో చేయాల్సిన సాయాన్ని మూడున్నరేళ్లలోనే చేశామని అన్నారు.
ప్రత్యేక హోదా అంశాన్ని నాడు కాంగ్రెస్ ప్రభుత్వం చట్టంలో ఎందుకు పెట్టలేదని హరిబాబు ప్రశ్నించారు. 4వేల కోట్ల నిధులు రెవెన్యూ లోటు కింద కేంద్రం ఇచ్చిందని మిగిలిన బకాయిల ఎంతనేదానిపై అంగీకారానికి చర్చలు జరుగుతున్నాయన్నారు.ప్రత్యేక హోదాకు సమానంగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అమలు చేస్తున్నామని, అయిదు సంస్థలు నెలకొల్పే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. రైల్వే జోన్ విషయంలో త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని, ఇక దుగరాజపట్నం బదులు వేరే ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సూచించాలని ఆయన అన్నారు.
పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్రానిదేనని, నాబార్డు ద్వారా నిధుల ఇస్తామని హరిబాబు తెలిపారు. విద్యుత్ కొరతతో అల్లాడుతున్న ఏపీకి 24 గంటల కరెంటు ఇచ్చామని,లక్షకోట్ల రూపాయల విలువైన రోడ్లు, రాజధానికి 3500 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. భవన నిర్మాణాలు మొదలుపెడితే నిరంతరం నిధులు ఇస్తామని, మూడున్నరేళ్లలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఏపికి ఇచ్చామని హరిబాబు వివరించారు. విభజన చట్టంలో ని 85శాతం హామీలు మూడున్నరేళ్లలో అమలు చేశామని,ఇందులో తప్పుంటే జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.విజయవాడ, విశాఖ మెట్రో పరిశీలనలో ఉందని, పెట్రో కాంప్లెక్స్ పై సాధ్యసాధ్యలపై అధ్యయనం జరుగుతోందని హరిబాబు పేర్కొన్నారు. టీడీపీ తమ మిత్రపక్షమని, ఏమైనా అనుమానాలు ఉంటే చర్చలు ద్వారా పరిష్కరించుకుంటామన్నారు.
- రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే రూ,2,500 కోట్లు ఇచ్చాం
- పోలవరం నిర్మాణానికి రూ.4,662.28 కోట్లు విడుదల చేశాం
- ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది
- విభజన చట్టం ప్రకారం కేవలం 5 సంస్థలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి
- కడప స్టీల్ ప్లాంట్ విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటాం
- దుగరాజపట్నం పోర్టుకు రక్షణ శాఖ నుంచి, ఇస్రో నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి
- రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం సూచిస్తే, అక్కడ వెంటనే పోర్టు నిర్మాణం చేపడతాం
- రైల్వే జోన్ అంశం కూడా త్వరలో ప్రకటన ఉంటుంది. ఏర్పాటు జరుగుతుంది
- చట్టంలో పదేళ్ళ కాలపరిమితిలోగా ఇవన్నీ చేయాలని ఉంది.
- కానీ నరేంద్ర మోదీ సర్కారు మాత్రం మూడేళ్లలోనే చాలా ఇచ్చింది
- 85 శాతం హామీలు మూడున్నరేళ్లలో అమలు చేశాం
- వెంకయ్య నాయుడు చొరవతో చట్టంలో ఉన్నవే కాదు, లేనివి కూడా మంజూరు అయ్యాయి
- రూ. లక్ష కోట్ల విలువ చేసే జాతీయ రహదారులు మంజూరు చేసాము
- షిప్పింగ్ మరియు వాటర్ వేస్లో కూడా చట్టంలో లేని ప్రాజెక్ట్ మంజూరు చేసాం
- పెట్రోలియం కాంప్లెక్స్ పని కూడా జరుగుతుంది
- తిరుపతి ఐఐటీకి రూ.90.93 కోట్లు కేంద్రం ఇచ్చింది
Comments
Please login to add a commentAdd a comment