సొంతిల్లు లేకుంటే.. 5 వేలు అద్దె | BJP election manifesto guarantees | Sakshi
Sakshi News home page

సొంతిల్లు లేకుంటే.. 5 వేలు అద్దె

Published Tue, Oct 2 2018 2:37 AM | Last Updated on Tue, Oct 2 2018 2:37 AM

BJP election manifesto guarantees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సొంతింటి కలను నిజం చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఆ కల సాకారమయ్యే వరకు ప్రతి నెలా రూ.5 వేలకు మించకుండా ఆయా కుటుంబాలకు ఇంటి అద్దె చెల్లిస్తామని వెల్లడించింది. ఈ మేరకు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నట్లు తెలిపింది. బీజేపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న కొన్ని హామీలను ఆ పార్టీ సోమవారం ప్రకటించింది. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ మేనిఫెస్టో కమిటీ వివిధ అంశాలపై చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చింది. వాటిని పార్టీ ఉన్నతస్థాయి కమిటీకి నివేదించాలని నిర్ణయించింది. అంతేకాదు ఏకాభిప్రాయం వచ్చిన అంశాలను మేనిఫెస్టోలో పొందుపరచనున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎండమావిగా మారాయని పేర్కొంది. కేంద్రం ప్రకటించిన ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చిందని తెలిపింది. అందుకే తాము అధికారంలోకి వస్తే డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకాన్ని కొనసాగిస్తూనే కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాజ్‌ యోజనను కచ్చితంగా అమలు చేస్తామని తెలిపింది.

సమావేశం అనంతరం ఆయా అంశాలను పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ వెల్లడించారు. మరిన్ని అంశాలపై మంగళవారం కూడా చర్చించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మొత్తానికి ఈ నెల 15 నాటికి బీజేపీ మేనిఫెస్టో రూపకల్పనను పూర్తి చేసి, ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు వివరించారు. సమావేశంలో మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌ మల్లారెడ్డి, సభ్యు లు ప్రొఫెసర్‌ వైకుంఠం, వైఎల్‌ శ్రీనివాస్, జగదీశ్వర్, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి దాసరి శ్రీనివాస్, ఎస్‌.కుమార్, సిద్దాగౌడ్, మాధవిచౌదరి, రాకేశ్‌ రెడ్డి, కరుణగోపాల్, ప్రభోదిని, సుభాషిణి పాల్గొన్నారు.


మేనిఫెస్టోలో చేర్చనున్న మరిన్ని అంశాలు
మున్సిపాలిటీలు, గ్రామాలు, మహానగరాల్లో నీటి పన్ను అధికంగా ఉంది. అందుకే ఎక్కడైనా రూ.6 పన్నుతో రక్షిత తాగునీరు సరఫరా చేస్తాం.
    రాష్ట్రంలో 59 ఎస్సీ ఉపకులాలు పోరాటం చేస్తున్నాయి. వారికి సర్టిఫికెట్ల జారీలో తాత్సారం జరుగుతోంది. అందుకే కుల ధ్రువీకరణ పత్రాల జారీని సులభతరం చేస్తాం.  
   డప్పు, చెప్పు, ఇతర చేతి వృత్తులు, కుల వృత్తుల వారందరికీ నెలకు రూ.3 వేల పెన్షన్‌ ఇస్తాం.
    పాత ఆటో, స్కూల్‌ వ్యాన్, సెవన్‌ సీటర్‌ ఆటోల వల్ల కాలుష్యం పెరిగిపోతోంది. అందుకే వాటి స్థానంలో ఎలాంటి డబ్బులు చెల్లించకుండా కొత్తవి ఇస్తాం. పాత ఆటో, పాత స్కూల్‌ వ్యాన్‌ ఇవ్వండి.. కొత్తవి తీసుకోండి.. అనే నినాదంతో దీనిని తీసుకొస్తాం. వాటిపై అన్ని రకాల పన్నులు రద్దు చేస్తాం.
    బీజేపీ అధికారంలోకి వస్తే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికే ఫీజులను నియంత్రించి, ఖరారు చేస్తాం. ఫీజుల నియంత్రణ కమిషన్‌ ఏర్పాటు చేస్తాం.
    ప్రైవేటు పాఠశాలలు, ఆస్పత్రులు, ఆలయాలు, మత సంస్థలకు సంబంధించిన వాటిపై ఆస్తి, నీరు, విద్యుత్‌ పన్నులు కమర్షియల్‌ స్లాబ్‌లో ఉండవు. ఇప్పుడున్న అలాంటి వాటన్నింటిని తొలగిస్తాం.
   చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తాం.
    ప్రైవేట్‌ కాలేజీలు, పాఠశాలల్లో పనిచేసే వారికి ఉచితంగా హెల్త్‌ కార్డులు ఇస్తాం.
    ప్రతి ఏడాది పోస్టుల భర్తీ చేపడతాం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తొలి 3 నెలల్లో 1 లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తాం.
 డిగ్రీ, ఆపై చదివే వారికి ఉచిత ల్యాప్‌టాప్‌లు అందజేస్తాం.
   బీసీ కులాలు రిజర్వేషన్లను పెంచాలని, సబ్‌ ప్లాన్‌ కావాలని కోరుతున్నాయి. అందుకోసం రిజర్వేషన్ల ప్రక్రియను 9వ షెడ్యూలులో చేర్చేలా కేంద్రాన్ని ఒప్పిస్తాం. రాష్ట్రానికి    ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపడతాం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement