
రాంచీ : ముఖ్యమంత్రి పీఠంపై వివాదంతో మహారాష్ట్రలో అధికారం దక్కించుకోలేకపోయిన బీజేపీకి త్వరలో రానున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు సవాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2019 లోక్‌సభ ఎన్నికల అనంతరం నరేంద్ర మోదీ కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టాక జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో గతంలో కంటే ఆపార్టీకి సీట్లు, ఓట్లు తగ్గాయి. హర్యానాలో ఒంటరిగా పోటీకి దిగిన బీజేపీ ఫలితాల అనంతరం కింగ్ మేకర్‌గా నిలిచిన జననాయక జనతా పార్టీ నాయకుడు దుష్యంత్ చౌతాలాతో పొత్తు కుదుర్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఇటు మహారాష్ట్రలో ఎన్డీఏ చిరకాల భాగస్వామి శివసేనతో కలిసి ఎన్నికల బరిలోకి దిగినా, ఫలితాల అనంతరం ఇరు పార్టీల మధ్య పొత్తు విచ్ఛిన్నమైంది. హర్యానాలో గతంలో కంటే సీట్లు, ఓట్లు తగ్గినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ మహారాష్ట్రలో మాత్రం ఆ పని చేయలేకపోయింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉంది. రానున్న జార్ఖండ్ ఎన్నికలను చూస్తే ఇన్నాళ్లూ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ పార్టీతో ఎన్నికలకు ముందే విడిపోయినట్టు కనిపిస్తోంది.
జార్ఖండ్‌లో ఐదు విడతలుగా జరిగే అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న ప్రారంభమై డిసెంబర్ 20కి ముగుస్తాయి. ఇంకో పదిహేను రోజుల్లో మొదటి విడత పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య ఇంకా సీట్లు ఖరారు కాకపోవడం, బీజేపీ తన అభ్యర్థులను ప్రకటిస్తుండడం చూస్తుంటే పొత్తు లేనట్టేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఒకవేళ పొత్తు కుదరకపోతే జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. ఇది కాక, ఎన్డీఏలో మరో భాగస్వామి పార్టీ అయిన ఎల్‌జేపీ ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో అధికారం పంచుకుంటున్నా, జార్ఖండ్‌లో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించింది. 2014 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మొత్తం 81 స్థానాలకు గాను, 43 స్థానాలు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇంకా పొత్తు కుదరకపోవడంతో 2014 పరిస్థితి పునరావృతం కాకపోవచ్చని విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పొత్తు కుదరకపోవడానికి మహారాష్ట్ర పరిస్థితిని ఉదాహరణగా వారు పేర్కొంటున్నారు.
శివసేన ప్రభావం?
ముందే పొత్తు కుదుర్చుకుంటే ఆ తర్వాత ఏపార్టీకి మెజారిటీ వచ్చినా బేరమాడే అవకాశాన్ని కోల్పోతామనే అంచనాలో ఎవరికి వారు ఉన్నారని తెలుస్తోంది. తమది చిన్న పార్టీ అయినా ఎన్నికల ఫలితాలనంతరం కింగ్ మేకర్‌గా నిలిచే అవకాశాలున్నాయని స్టూడెండ్ యూనియన్ పార్టీ భావిస్తోంది. అదృష్టం కలిసివస్తే శివసేనలా తమకూ సీఎం పీఠం దక్కే అవకాశాన్ని కొట్టిపారేయలేమని వారు అంతర్గత చర్చల్లో వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు సీట్లు ఖరారు చేసుకొని ఎన్నికల ప్రచారంలో బలంగా దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో జార్ఖండ్‌లో అధికార బీజేపీ ప్రతిపక్షానికే పరిమితమయ్యే అవకాశాలున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ 61 స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్నా అందులో సగం సీట్లు గెలవడం కూడా కష్టమనే అభిప్రాయం శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
ఇదికాక, బీజేపీ చీఫ్ విప్ రాధాకృష్ణ కిషోర్‌తో పాటు మరికొందరు నాయకులు ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ పార్టీలో చేరడం పార్టీకి కొత్త తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో అమిత్‌షా నేతృత్వంలోని బీజేపీ జార్ఖండ్‌లో అధికారం కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే అయోధ్యలో రామమందిర నిర్మాణం గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తమను గట్టెక్కిస్తుందని వారు బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య తీర్పు ఎంతవరకు ఓట్లను రాల్చగలదనే అంశం ఈ ఎన్నికల్లో తేలిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు 2019 లోక్‌సభ ఎన్నికలకు ఏడాది ముందు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్‌లలో అధికారం కోల్పోవడం బీజేపీ హవా తగ్గుతోందనడానికి నిదర్శనమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. హిందీ బెల్ట్ ఏరియాలో బలంగా ఉండే బీజేపీకి ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయని చెప్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ హవా పని చేయడం లేదా?
ఇదిలా ఉండగా, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విఫలమవుతున్నా, లోక్‌సభలో మాత్రం ఆ పార్టీకి గతంలో కంటే ఎక్కువ స్థానాలు వచ్చాయి. వీటికి కారణాలు పరిశీలించగా, కేంద్రంలో నరేంద్ర మోదీ హవా బలంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రాల ఎన్నికలు అంటే ఓటర్లు స్థానిక సమస్యలు, స్థానిక నాయకత్వ పనితీరు వంటివి పరిగణనలోకి తీసుకుంటారని, అదే పార్లమెంట్ ఎన్నికల్లో దేశ సమస్యల గురించి ఆలోచిస్తారని చెప్తున్నారు. ఆయా ఎన్నికలకు ఓటర్ల ప్రాధామ్యాలు మారిపోతుంటాయని బలంగా వాదిస్తున్నారు. ఇదే నరేంద్రమోదీ, అమిత్ షాలు ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం చేసినా, లోక్‌సభలో వచ్చిన ఫలితాలు రాలేదని గుర్తు చేస్తున్నారు. స్థూలంగా చూస్తే 2018 నవంబర్‌లో 16 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఉండగా, ఒక్క ఏడాదిలోనే ఆ సంఖ్య 12కి తగ్గింది. అంటే లోక్‌సభ ఎన్నికలు ప్రధాని కేంద్రంగా జరుగుతాయి కాబట్టి ఓటర్లు మోదీ వైపు మొగ్గుచూపుతున్నారని స్పష్టమవుతోంది.
తెలంగాణ ఫలితాలే ఉదాహరణ!
దీనికి కొందరు గత డిసెంబరులో జరిగిన తెలంగాణ ఎన్నికలను ఉదాహరణగా చెప్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందగా, ఒకేఒక్క ఎమ్మెల్యే సీటు నెగ్గిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుంది. అందులోని మూడు స్థానాలు టీఆర్‌ఎస్ చాలా బలంగా ఉంటుందని నమ్మే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో గెలుపొందింది. కనీసం కార్యకర్తలు కూడా లేని ఆదిలాబాద్ లాంటి చోట బీజేపీ గెలవడం చూస్తే మోదీ హవానే కారణమని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఉటంకిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఓటర్ల నాడి ఏంటనేది అర్థమవుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేరుగా మోదీపై ప్రభావం చూపకపోవడానికి ఇది ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రాష్ట్రాల ఎన్నికలకు ప్రధానికి ప్రత్యక్ష సంబంధం లేదని ఓటర్లు భావిస్తున్నారు.