హరియాణాలో బీజేపీకే ‘జేజే’పీ | BJP- JJP join hands to stake claim to form govt on Saturday | Sakshi
Sakshi News home page

హరియాణాలో బీజేపీకే ‘జేజే’పీ

Published Sat, Oct 26 2019 3:32 AM | Last Updated on Sat, Oct 26 2019 3:32 AM

BJP- JJP join hands to stake claim to form govt on Saturday - Sakshi

విజయ సంకేతం చూపుతున్న దుష్యంత్‌ చౌతాలా, జేపీ నడ్డా, అమిత్‌షా, ఖట్టర్, అనురాగ్‌ ఠాకూర్‌

న్యూఢిల్లీ:  హరియాణాలో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడనుంది. గురువారం వెలువడిన అసెంబ్లీ ఫలితాల్లో హరియాణాలో ఏ పార్టీకి మెజారిటీ రాని విషయం తెలిసిందే. 90 స్థానాలకు గానూ బీజేపీ 40 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. 10 సీట్లు గెలుచుకున్న జన నాయక జనతా పార్టీ(జేజేపీ)తో బీజేపీ శుక్రవారం పొత్తు పెట్టుకుని, ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకుంది. పొత్తు షరతుల్లో భాగంగా జేజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, ఉప ముఖ్యమంత్రిగా జేజేపీ నేత ఉంటారని బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా, జేజేపీ నేత దుష్యంత్‌ చౌతాలా శుక్రవారం సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌నే మళ్లీ సీఎంగా బీజేపీ శాసనసభాపక్షం ఎన్నుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఉపముఖ్యమంత్రిగా దుష్యంత్‌ చౌతాలా ఉంటారని జేజేపీ వర్గాలు తెలిపాయి. హరియాణాలో రాజకీయ సుస్థిరత కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు దుష్యం త్‌ చౌతాలా తెలిపారు. హరియాణాలో మెజారిటీ వచ్చే అవకాశం లేదని అమిత్‌ షాకు ముందే   సమాచారముందని, అందువల్ల ఫలితాల వెల్లడికి ముందే అమిత్‌షా దుష్యంత్‌ చౌతాలాతో మాట్లాడా రని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.  బీజేపీ శాసనసభాపక్ష సమావేశం శనివారం జరుగుతుందని, ఆ సమావేశానికి పరిశీలకులుగా కేంద్రమంత్రి నిర్మల సీతారామన్, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ హాజరవుతారని బీజేపీ హరియాణా ఇన్‌చార్జ్‌ అనిల్‌ జైన్‌ వెల్లడించారు.  ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ ఖట్టర్‌ శనివారం గవర్నర్‌ను కలిసి కోరతారని, దీపావళి తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు.

ముందు స్వతంత్రుల మద్దతుతో..
ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన బీజేపీ గురువారం ఫలితాలు వెల్లడైనప్పటి నుంచే పావులు కదపడం ప్రారంభించింది. మెజారిటీకి ఆరు స్థానాలు అవసరమవడంతో.. తాజాగా గెలిచిన ఏడుగురు ఇండిపెండెంట్లతో సంప్రదింపులు జరిపింది. వారు కూడా మద్దతివ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తూ ఢిల్లీలో బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డా నివాసంలో మద్దతు లేఖను సీఎం ఖట్టర్‌కు అందజేశారు. స్వతంత్రుల్లో ఎక్కువమంది బీజేపీ రెబల్సే కావడం గమనార్హం. జేజేపీ మద్దతిచ్చేముందు, ఐఎన్‌ఎల్‌yీ  ఎమ్మెల్యే అభయ్‌ చౌతాలా మద్దతూ తమకేనని బీజేపీ నమ్మకంగా ఉంది.

గోపాల్‌ కందా మద్దతుపై అభ్యంతరం
స్వతంత్రులు, ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్న సమయంలో.. హరియాణ్‌ లోక్‌హిత్‌ పార్టీ నేత, ఎమ్మెల్యే గోపాల్‌ కందా నుంచి మద్దతు తీసుకోవడంపై వివాదం నెలకొంది. పలు క్రిమినల్‌ కేసులున్న స్వతంత్ర ఎమ్మెల్యే గోపాల్‌ కందా మద్దతు తీసుకుని పార్టీ నైతిక విలువలకు ద్రోహం చేయవద్దని సీనియర్‌ నేత ఉమాభారతి పార్టీ నాయకత్వాన్ని కోరారు.

వెనక్కు తగ్గని కాంగ్రెస్‌
కాంగ్రెస్‌కు చెందిన మాజీ సీఎం భూపీందర్‌ హుడా కూడా శుక్రవారం ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ తదితరులతో భేటీ అయ్యారు. జేజేపీ(జననాయక్‌ జనతా పార్టీ)తో చర్చలు జరుపుతూనే, స్వతంత్రులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, కాంగ్రెస్‌తో జేజేపీ కలిసి వచ్చినప్పటికీ మెజారిటీకి మరో ఐదుగురు సభ్యుల బలం అవసరం ఉంటుంది. ఈ పరిస్థితిపై హుడా స్పందిస్తూ.. ‘ప్రభుత్వం ఏర్పాటు ప్రయత్నాల్లో మేం ఏమాత్రం వెనుకబడలేదు. స్వతంత్రులు చాలామంది మాతో కూడా టచ్‌లో ఉన్నారు’ అని పేర్కొన్నారు. స్వతంత్రులు బీజేపీకి మద్దతు ప్రకటించారంటూ వస్తున్న వార్తలపై హుడా స్పందిస్తూ..‘వారి గొయ్యి వారే తవ్వుకుంటున్నారు. ప్రజా విశ్వాసాన్ని కాలరాస్తున్నారు. హరియాణా ప్రజలు వారిని ఎన్నటికీ క్షమించరు. వారిని చెప్పులతో కొట్టడం ఖాయం’అని మండిపడ్డారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement