
సాక్షి, హైదరాబాద్ : హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన యాదాద్రిలో అపచారాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. బుధవారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ హైందవ ధర్మానికి ముప్పుగా మారారని, బొట్టు పెట్టుకొని యాగాలు, పూజాలు చేస్తే భక్తునిగా మారలేరని కేసీఆర్‌ను విమర్శించారు. యాదాద్రిలో దేవుడి కంటే ముందు కేసీఆర్‌ను దర్శించుకునేందుకు చిత్రాలు వేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీ నరసింహ స్వామిని ఉల్లితో చెక్కడం దారుణమన్నారు. శిల్పులు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు శిల్పాలు చెక్కుతున్నట్లు అధికారులే స్పష్టం చేశారని లక్ష్మణ్ తెలిపారు.
ఇక ఆధ్యాత్మికాన్ని అడ్డు పెట్టుకొని యాదాద్రిలో కేసీఆర్ రియల్ ఎస్టేల్ వ్యాపారానికి తెరలేపారని లక్ష్మణ్ ఆరోపించారు. యాదాద్రి అభివృద్ధి కంటే రియల్ ఎస్టేట్‌పై కేసీఆర్‌కు మక్కువ ఎక్కువైందని, యాదాద్రిలో ఆయన మహా అపచారానికి పాల్పడుతున్నారని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఒక గజినీలా తయారయ్యారని విమర్శించారు. యాదాద్రి జరుగుతున్న అపచారంపై సీఎం వివరణ ఇవ్వాలని డిమండ్ చేశారు. గుడి పునర్నిర్మాణం పేరుతో సినిమా ఆర్ట్ డైరెక్టర్‌తో అవినీతి పనులు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మీడియా స్వేచ్చను హరించిందని, కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకునే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని దుయ్యబట్టారు. ‘కేసీఆర్ చింతమడకకు కేంద్రం ఎంత నిధులు ఇచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది’ అని ప్రశ్నించారు. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ, బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కేటీఆర్‌కు బీజేపీ లక్ష్మణ్ సవాల్ విసిరారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాస్త బ్రాందీ గా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలో హైటెక్ సిటీ నుంచి మాదాపూర్ వరకు కోవొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దిశా ఘటన నిందితులను ప్రభుత్వం కచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా ముఖ్యమంత్రి తన ఇంటికి వెళ్లి కనీసం కుటుంబ సభ్యులను పరామర్శించలేదని విమర్శించారు.