సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టించిన ప్రియాంకరెడ్డిపై అత్యాచారం, హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం ధర్నాచౌక్‌లో మౌన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డీకే అరుణ, మహిళ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ, బండారు రాధిక, ఎమ్మెల్సీ రాంచందర్ రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళల భద్రత పట్ల డీకే అరుణ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ కాదు. భద్రత తెలంగాణ కావాలని వ్యాఖ్యానించారు. మంత్రులకు భారీ భద్రత పెట్టుకున్నవారు మహిళలకు భద్రత కల్పించలేరా? అంటూ ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థను, ఇంటెలిజెన్స్‌ను ముఖ్యమంత్రి స్వంతానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆర్టీసీ సమ్మెలో అన్ని బస్టాండ్‌లలో పోలీసులను వాడుకున్నారని విమర్శించారు. క్రిమినల్ మైండ్‌సెట్ ఉన్నవాళ్లను పోలీసులు గుర్తించలేరా? అంటూ మండిపడ్డారు. ప్రియాంకకు జరిగిన దారుణంపై కేసీఆర్ బయటకు వచ్చి నోరు విప్పాలని, ఆయన అభిప్రాయమేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment