
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళకు రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ నేత గీతారెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా నగరంలో చోటుచేసుకున్న ప్రియాంకరెడ్డి హత్యపై స్పందించిన గీతా రెడ్డి శనివారం ప్రియాంక తల్లిదండ్రులను కలిసి పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రియాంక హత్య అందరిని కలచివేస్తుందన్నారు. ప్రియాంక ఘటన మరవక ముందే మరో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందడం బాధాకరమన్నారు. 50 శాతం ఉన్న మహిళలకు ఎలాంటి భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక 2017లో మహిళలపై 14 శాతం హత్యలు పెరిగాయన్నారు. అంతేగాక మహిళ అక్రమ రవాణా కూడా పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. తమ కూతురు కనిపించడం లేదని ప్రియాంక తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని, వారితో కూడా సరిగా మాట్లాడలేదని గీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రమాద సమయంలో ప్రియాంక తన చెల్లెలికి కాకుండా పోలీసులకు కాల్ చేయాలి’ అని హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment