
సాక్షి, హైదరాబాద్ : లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను కేసీఆర్ ప్రభుత్వం ఆగం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. 23 మంది ఇంటర్మిడియట్ విద్యార్థుల ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలపై కానీ, పరీక్షల మీదకానీ విద్యాశాఖ మంత్రి కనీసం సమీక్ష కూడా చేయకపోవడం దారుణమన్నారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేసేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ నెల 28ప అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక్క రోజు నిరసన దీక్ష చేపడతామని, 29న హైదరాబాద్‌లో తల్లిదండ్రులు, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 30న ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని, డిమాండ్లను నెరవేర్చక పోతే మే 2న రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో జరగబోయే పరిణామాలను ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.