‘ముఖచిత్రం చెక్కించడంలో కేసీఆర్‌ బిజీ’ | BJP Leader Laxman Slams CM KCR Face Carving At Yadadri Temple | Sakshi
Sakshi News home page

‘ముఖచిత్రం చెక్కించడంలో కేసీఆర్‌ బిజీ’

Sep 7 2019 4:18 PM | Updated on Sep 7 2019 4:42 PM

BJP Leader Laxman Slams CM KCR Face Carving At Yadadri Temple - Sakshi

రాష్ట్ర ప్రజలంతా విషజ్వరాలతో అల్లాడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని, కేసీఆర్‌ యాదగిరి గుట్టలో తన ముఖచిత్రం చెక్కించడంలో మునిగిపోయారని ఎద్దేవా చేశారు.

సాక్షి, హైదరాబాద్‌ : డెంగ్యూ వ్యాధికి హైదరాబాద్‌ రాజధానిగా మారిందని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. డెంగ్యూ, చికెన్ గున్యా రోగులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలంతా విషజ్వరాలతో అల్లాడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని, కేసీఆర్‌ యాదగిరి గుట్టలో తన ముఖచిత్రం చెక్కించడంలో మునిగిపోయారని ఎద్దేవా చేశారు. పారిశుధ్య లోపంతోనే ఈ పరిస్థితులు తలెత్తాయని అన్నారు. శనివారం ఆయన గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. సరైన వైద్య సదుపాయాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఆరోగ్య శ్రీ పరిధిలో జ్వరాలు లేవు. ప్రైవేటు ఆసుపత్రులు చేర్చుకోవు. ఇక కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్‌ పథకాన్ని కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు. ఇప్పటివరకు వైద్యుల నియామకం కోసం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. గాంధీ ఆస్పత్రిలో వేయిపడకల సామర్థ్యం ఉంటే 2500 మంది రోగులొస్తున్నారు. అక్కడ 800 మంది నర్సులు అవసరమైతే కేవలం 350 మందే ఉన్నారు. ఇక ఐసీయూలో దారుణం. అక్కడ 65 బెడ్లకు గాను 20 మందే నర్సులు సేవలందిస్తున్నారు.

రోజు 200 మంది ఐసీయూలో చేరుతున్నారు. గాంధీలో మరో 100 పడకల ఆస్పత్రి, ఉస్మానియాలో కొత్త భవనాల నిర్మాణం అని చెప్పిన ముఖ్యమంత్రి వాటి ఊసే ఎత్తడం లేదు. రూ. 500 కోట్లతో సచివాలయం నిర్మిస్తామని చెప్తున్న కేసీఆర్‌ ప్రభుత్వాస్పత్రుల్ని మాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రోగులకు మెరుగైన సేవలందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేస్తాం. మంత్రులకు చేతనైతే సీఎంతో మాట్లాడి సేవలందించాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. గులాబి జెండా ఓనర్షిప్ కోసం కొట్లాడటం మాని ప్రజలకు సేవ చేయండి’అని హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement