బన్సీలాల్‌పేట్/మారేడుపల్లి : ప్రభుత్వ నిర్వాకం.. పరీక్షల్లో జరిగిన అవకతవకల వల్లే రాష్ట్రంలో 26 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఆరోపించారు. మంగళవారం బన్సీలాల్‌పేట్ డివిజన్ చాచానెహ్రునగర్‌లోని ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని అనామిక కుటుంబాన్ని, మారేడుపల్లిలోని లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఇంటర్ విద్యార్థుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందన్నారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆత్మహత్యలు చేసుకోవడం దారుణమన్నారు. చదువుతో పాటు ఎన్‌సీసీలో జాతీయ స్థాయిలో రాణిస్తున్న అనామిక మరణం హృదయ విదారకరమన్నారు. అనామిక సోదరి ఉదయ డిగ్రీ ఫీజులను భరించడంతో పాటు వారి కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ....ప్రభుత్వ హత్యలేనని స్పష్టం చేశారు. వాస్తవాలకు విరుద్ధంగా విద్యా మంత్రి, ఇంటర్ బోర్డు అధికారులు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై తమ పోరాటం ఆగదని..ఉద్యమాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రపతి దృష్టికి వివరాలు
వివరాలు సేకరించి రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖ దృష్టికి సుకెళతామని లక్ష్మణ్ పేర్కొన్నారు. మెరిట్ విద్యార్ధులు ఇంటర్‌లో సింగిల్ డిజిట్ మార్కులు రావడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న ఏ ఒక్క విద్యార్ధి కుటు ంబ సభ్యులను కూడా ఏ ఒక్క మంత్రి పరామర్శించిన దాఖలాలు లేవని ఆయన అన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, కార్యదర్శి ఎస్. కుమార్, మాధవీ, టి. రాజశేఖరరెడ్డి, వై. సురేష్‌కుమార్, ఎ. ఆనంద్ యాదవ్, రామ్ రమేష్, అధికార ప్రతినిధి మాధవి, జనరల్ సెక్రటరీ ప్రేమిందర్, కార్యదర్శి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment