విలేకర్లతో మాట్లాడుతున్న సోము వీర్రాజు
సాక్షి, ఒంగోలు/కావలి: చారిత్రాత్మక కేంద్ర బడ్జెట్‌పై టీడీపీ నేతలు రెండు రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు గతి తప్పి గీత దాటుతున్నట్లుగా ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. శనివారం ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక రాష్ట్రానికి, ఒక జిల్లాకు కావాల్సిన అవసరాలన్నీ బడ్జెట్‌లో ప్రస్తావించడం కుదరదన్నారు. పోలవరానికి కేంద్రం ఇప్పటికే రూ.4,300 కోట్ల నిధులిచ్చినా ఇవ్వలేదని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. రైల్వేజోన్‌పై గతంలో వేసిన ఒక కమిటీ అనుకూల నివేదిక ఇవ్వలేదన్నారు. దీంతో సాంకేతిక సమస్య ఏర్పడడంతో బడ్జెట్‌లో పేర్కొనలేని పరిస్థితి నెలకొందన్నారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను మంత్రిగా చేసి, నేడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఒక ప్రజాప్రతినిధి మాట్లాడుతున్న విధానం ఆశ్చర్యంగా ఉందన్నారు.
ఆ వ్యాఖ్యల మర్మమేమి?
‘చంద్రబాబును తక్కువగా అంచనా వేస్తున్నారు. గతంలో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పాడు... మరలా అదే రాబోతోంది’ అన్న వ్యాఖ్యలను ఏ కోణంలో చూడాలని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నాయకులు ఎవరైనా విమర్శలు చేస్తే కాంగ్రెస్ కోవర్టులనడం రాయపాటి సాంబశివరావుకు పరిపాటిగా మారింది. కానీ ఆయన ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు.. పొగాకులో రాళ్లుపెట్టి చైనాకు అమ్మాడు’ అంటూ ఆయన ధ్వజమెత్తారు. టీడీపీకి పట్టినగతే బీజేపీకి పడుతుందని టీజీ వెంకటేశ్ అంటున్నాడని, ఆయన కాంగ్రెస్‌లో మంత్రిగా చేసి రాష్ట్రంలో ఎలా గెలిచారో అందరికీ తెలుసున్నారు. ఇలాంటి వారా తమను హెచ్చరించేది? ఇదేనా మిత్రధర్మం? అంటూ ప్రశ్నించారు. కేంద్రం రూ.21వేల కోట్ల ఉపాధి హామీ నిధులు మంజూరు చేస్తే రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు దాన్ని తమకు ఉపాధిగా మార్చుకున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. విలేకరుల సమావేశానికి ముందు కలెక్టరేట్ వద్ద బీజేపీ జిల్లా శాఖ నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు.
మీరు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారు?
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2005లో పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, అంతకుముందు 1995 నుంచి 2004 వరకు సీఎంగా ఉన్న చంద్రబాబు ఎందుకు ఆ పని చేయలేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment