
ఉనికిని కాపాడుకునేందుకు, ఓట్లు దండుకునేందుకు ప్రయత్నాలు
సాక్షి, అనంతపురం : బాబ్లీ పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సరికొత్త నాటకానికి తెరలేపారని బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దుకాణం బంద్ అయిన విషయాన్ని గ్రహించిన బాబు.. ఉనికిని కాపాడుకునేందుకు, ఓట్లు దండుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారంటూ విమర్శించారు. చంద్రబాబు నాన్ బెయిలబుల్ అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉందన్న ఆరోపణలను ఖండించిన విష్ణువర్ధన్ రెడ్డి... ఆ కేసు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అంటూ ప్రశ్నించారు. అయినా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు కోర్టుకు హాజరు కాకపోతే అరెస్టు వారెంట్ వస్తుందన్న విషయం తెలీదా అంటూ ఎద్దేవా చేశారు. నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు పేరిట తెలంగాణ ప్రజల సానుభూతి పొందేందుకు బాబు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
ఆపరేషన్ గరుడా.. పెరుగు వడా ఏమైంది..
టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ శివాజీ ‘ఆపరేషన్ గరుడా.. పెరుగు’ వడా అంటూ చేసిన ఫిర్యాదుపై విచారణ ఎందుకు చేపట్టలేదంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ ముసుగు ధరించిన వ్యక్తి శివాజీ నాటకాలు ఎవరూ నమ్మరన్నారు. అయినా సిల్లీ గల్లీ కేసులకు సుప్రీంకోర్టు న్యాయవాదులు ప్రజల సొమ్ము లక్షల రూపాయలు వెచ్చిస్తారా అంటూ ప్రశ్నించారు.