
సాక్షి, అమరావతి : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం దారుణమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన బుధవారం అమరావతిలో మాట్లాడుతూ... పార్టీ ఫిరాయించినవారిపై అనర్హత వేటు వేయాలన్నారు. పార్టీ మారిన ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి గెలిచి హుందాగా సభలోకి రావాలని సూచించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదవులు కట్టబెట్టడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లేకపోతే ఏ పార్టీ గుర్తుపై గెలిచినా... మంత్రులు కావచ్చనే కొత్త చట్టాన్ని ప్రవేశపెడితే బాగుంటుందని విష్ణుకుమార్‌రాజు చమత్కరించారు.
ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమే...
మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు.. మంత్రులుగా కొనసాగడం అనైతికం అన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ స్పందించారు. ఆయన బుధవారమిక్కడ
మాట్లాడుతూ..విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతంగా పరిగణిస్తున్నాం. వాటికి విలువలేదు. వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసే టీడీపీలోకి వచ్చారు. వారి రాజీనామాల అంశం ప్రస్తుతం స్పీకర్ పరిధిలో ఉంది. శాసనసభ వ్యవస్థలో స్పీకర్‌దే తుది నిర్ణయం. ఉప ఎన్నికలకు ఆ నలుగురు మంత్రులు సిద్ధంగా ఉన్నారు. మిత్రపక్షంగా ఉన్నప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ లేదు. ఇరు పార్టీల రాష్ట్ర, జాతీయ అద్యక్షులు చూసుకుంటారు. వారు స్పందిస్తేనే పార్టీ ప్రకటనగా భావిస్తాం. ఆయన ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో నాకు తెలియదు అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment