సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ అని.. భారీగా కేటాయింపులు చూపుతూ, తక్కువగా ఖర్చు చేస్తున్నారని శాసన మండలిలో బీజేపీ మండిపడింది. ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇలా చేస్తోందని విమర్శించింది. సోమవారం శాసనమండలి లో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడారు. రెండున్నర లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తా మని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించిందని.. కానీ నాలుగేళ్లలో నిర్మించినది 9 వేల ఇళ్లు మాత్రమేనన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లోనూ డబుల్ ఇళ్లకు కేటాయించింది రూ.4 వేల కోట్లేనని.. ఈ నిధులతో ఎన్ని లక్షల ఇళ్లు కడతారని ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే అంకెల గారడీ బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అందరు రైతులు ఖరీఫ్, రబీ రెండు పంటలు పండించడం సాధ్యం కాదని.. అలాంటప్పుడు రెండో పంటకు కూడా రూ.4 వేల చొప్పున ఏవిధంగా సహాయం అందిస్తారన్న దానిపై స్పష్టత లేదన్నారు. దీనికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమాధానమిస్తూ.. మహబూబ్‌నగర్‌లోని ప్రాజెక్టుల ద్వారా 6.5 లక్షల ఎకరాల్లో రెండో పంట సాగవుతోందని, ఈ ఏడాది జూలై, ఆగస్టు కల్లా కాళేశ్వరం ప్రాజెక్టుతో మరిన్ని లక్షల ఎకరాల్లో రెండో పంట సాగవుతుందని చెప్పారు. రెండో పంట పండించే రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇచ్చి తీరుతామని చెప్పారు. కాగా, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు వ్యాఖ్యలను మండలిలో టీఆర్‌ఎస్ సభ్యులు తిప్పికొట్టారు. సమైక్య రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దగా నిధులివ్వలేదని, తమ ప్రభుత్వం రూ.15 వేల కోట్లకుపైగా కేటాయించిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బడ్జెట్ ప్రతి వర్గాన్ని సంతృప్తి పరిచేలా ఉందని టీఆర్‌ఎస్ మరో ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు అన్నారు.
మంత్రులు మండలికి రావాలి: స్వామిగౌడ్
శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ సోమవారం సమావేశాలకు హాజరయ్యారు. మంత్రులు శాసన మండలికి దూరంగా ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయం కేటాయించిన విధంగా మంత్రులు మండలికి హాజరుకావాలని.. సమయం ప్రకారం అసెంబ్లీకి వెళ్లాలని సూచించారు.
బడ్జెట్ అంకెల గారడీ!
Published Tue, Mar 20 2018 1:23 AM | Last Updated on Tue, Mar 20 2018 1:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment