‘రాజేంద్రప్రసాద్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి’ | BJP MLC Somu Veerraju condemned tdp mlc rajendraprasad comments | Sakshi
Sakshi News home page

‘రాజేంద్రప్రసాద్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి’

Published Tue, Dec 19 2017 12:07 PM | Last Updated on Mon, Oct 22 2018 8:57 PM

BJP MLC Somu Veerraju condemned tdp mlc rajendraprasad comments - Sakshi

సాక్షి, విజయవాడ : బీజేపీకి అంత సీన్‌ లేదంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. ఈ వ్యాఖ్యలను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రంగా తప్పుబట్టారు. సోము వీర్రాజు మంగళవారం ఇక్కడ గుజరాత్‌ ఎన్నికల ఫలితాలపై మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికైనా రాజేంద్రప్రసాద్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని ఆయన హితవు పలికారు. సోము వీర్రాజు మాట్లాడుతూ...‘కాంగ్రెస్‌ సహకారంతోనే నేషనల్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌ గా చంద్రబాబు ఒకరిని ప్రధానమంత్రిని చేశారు. టీడీపీతో పొత్తు లేనప్పుడే మాకు 18 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీతో కలిసి వెళ్లడం వలన 2004 ఎన్నికల్లో ఓడిపోయాం. ఇలాంటి నిర్ణయం చరిత్ర తప్పిదం. 10 సంవత్సరాలు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2009లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయింది. బీజేపీతో పొత్తు పెట్టుకుని చరిత్రాత్మక తప్పు చేశామని చంద్రబాబు గతంలో చెప్పారు.

2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోమని ఉదయం చెప్పి... సాయంత్రానికి చల్లబడ్డారు. కాకినాడ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసి మేము ఎక్కువ స్థానాల్లో గెలిసేవాళ్లమని, అయితే టీడీపీ వాళ్లు డబ్బులు ఖర్చు పెట్టి గెలిచారు. కాకినాడకు స్మార్ట్‌ సిటీ, పోర్ట్‌ ఇచ్చాం. కాకినాడలో చెప్పుకోవడానికి టీడీపీకి ఏమీలేదు. ప్రతిసారి మిత్రపక్షం చేతిలో మోసపోతున్నాం. కనీపం పార్టీ కార్యకర్తలకు కూడా ఇళ్లు, రేషన్‌ కార్డులు, పింఛన్లు ఇప్పించుకోలేకపోతున్నాం. బీజేపీ ఎదుగుతుంటే అడ్డుకొనేందుకు కుట్ర చేస్తున్నారు.

లేకుంటే ప్రత్యేక హోదా అంశాన్ని తెరమీదకు తెస్తున్నారు. ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకున్నారు. ప్యాకేజీ ద్వారా వచ్చేది 3వేల కోట్లు మాత్రమే. పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగించింది బీజేపీనే. పోలవరంపై చిత్తశుద్ధి ఉంటే 1995 నుంచి 2004 వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎందుకు శంకుస్థాపన చేయలేకపోయారు. మరి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎందుకు పోలవరం ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. బీజేపీతో పొత్తు వద్దనుకుంటే చంద్రబాబు చెప్పాలి. టీడీపీ నేతలు వాళ్ల పరిధిని మించి మాట్లాడుతున్నారు.’ అని మండిపడ్డారు.

బీజేపీకి అంత సీన్‌ లేదు...
కాగా వచ్చే ఎన్నికల నాటికి తాము (బీజేపీ) హీరోలుగా మారతాం. ఏపీలో బీజేపీ బలపడుతుందన్న సోము వీర్రాజు వ్యాఖ్యలపై టీడీపీ నేత రాజేంద్రప్రసాద్‌ స్పందిస్తూ.. సోము వీర్రాజు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని, ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని కలలు కంటున్నారని అన్నారు. ‘మా దయ వల్లే ఏపీలో బీజేపీకి నాలుగు సీట్లు వచ్చాయి. మా దయ లేకుంటే బీజేపీకి ఆ సీట్లు కూడా వచ్చేవి కావు. బీజేపీ నేతలు కలలు కనడం మానుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి అంత సీన్‌ లేదు. మా దయాదాక్షిణ్యాల వల్లే మనుగడ సాగిస్తున్నారు.’ అని  వ్యాఖ్యలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement