
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు
విజయవాడ: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి బినామీ సీఎం రమేష్ అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జీవీఎల్ విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ దిగజారుడు మనిషని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రమేష్‌ను రాజ్యసభకు పంపినందుకు చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే రాజ్యసభ సభ్యత్వం నుంచి తొలగించాలని కోరారు. జాతీయ స్థాయిలో వచ్చిన కథనాలపై సీఎం రమేశ్ ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మీసం మెలేసిన సీఎం రమేష్ జాతీయ స్థాయిలో వచ్చిన కథనాలతో మీసం తీయించుకుంటారా అని సవాల్ విసిరారు. ఒక అవినీతి పరుడైన సీఎం రమేష్‌ని పబ్లిక్ కమిటీలో స్థానం కల్పించాలని సీఎం ఎలా రికమెండేషన్ చేస్తారని అడిగారు.
సీఎం రమేష్‌పై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు
సీఎం రమేష్ తీరుపై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సీఎం రమేష్ వ్యవహరించే తీరు, పార్లమెంటు సభ్యులకు ఉండాల్సిన లక్షణాలు ఏవీ లేవని అభిప్రాయపడ్డారు. సీఎం రమేష్ అవినీతిపై కూడా ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. సీఎం రమేశ్ వాడే బాష పార్లమెంటు సంప్రదాయానికి విరుద్ధంగా ఉందన్నారు.
ఐటీ పేరుతో లూటీ
రాష్ట్రంలో ఐటీ పేరుతో చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌లు లూటీ చేస్తున్నారని జీవీఎల్ ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు భూములు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. సమాచార చట్టం ద్వారా ఐటీ కంపెనీలకు కేటాయించిన వివరాలు అడిగితే ఎందుకు ఇవ్వడం లేదని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లోకేష్ తన బినామీలకు ఐటీ కంపెనీల పేరుతో వేల కోట్ల రూపాయల భూమలు కేటాయిస్తున్నారని విమర్శించారు. ప్రజా ధనాన్ని లూటీ చేయడానికి లోకేష్‌కు ఐటీ మంత్రి పదవి ఇచ్చారని ఆరోపించారు. 24 గంటల్లో ఐటీ కంపెనీలకు ఇచ్చిన భూముల వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఐటీ కంపెనీల ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు.
దొంగ దీక్షలు..తప్పుడు వ్యాపారాలు
సీఎం రమేష్ దాదాపు రూ.100 కోట్ల టాక్స్ ఎగ్గొట్టారని, దొంగ దీక్షలు, తప్పుడు వ్యాపారాలు చేశారని జీవీఎల్ ఆరోపించారు. సొంత కంపెనీ అకౌంట్స్‌లోనే దొంగ లెక్కలు చూపించే వ్యక్తిని చంద్రబాబు పబ్లిక్ అకౌంట్స్‌లో మెంబర్‌గా చేశారని విమర్శించారు. సీఎం రమేష్ లాంటి వ్యక్తుల వల్ల పార్లమెంటు పరువుపోతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చర్యలు తీసుకోకపోతే రమేష్ వెనక చంద్రబాబు నాయుడు ఉన్నారని అర్ధం చేసుకోవలసి వస్తుందని అన్నారు. టీడీపీలో విలువలు లేవని చెప్పడానికి సీఎం రమేష్ ఒక ఉదాహరణ అని చెప్పారు.
2019 తర్వాత టీడీపీ కనుమరుగు
2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీడీపీ కనుమరుగు కానుందని జోస్యం చెప్పారు. సీఎం రమేష్ వాస్తవాలను జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. అందుకే ఆయనపై విమర్శలు చేసిన వారిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రమేష్ సారాయ కాంట్రాక్టర్, వీధి రౌడీలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment