బెంగాల్‌ వార్‌ | BJP Targets Bengal Lok Sabha Election | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ వార్‌

Published Fri, May 10 2019 9:06 AM | Last Updated on Fri, May 10 2019 9:06 AM

BJP Targets Bengal Lok Sabha Election - Sakshi

మోదీ సర్కారుపై జనం అంచనాలు... రాష్ట్రంలోని మొత్తం 42 సీట్లలో తృణమూల్‌ ఎన్ని సీట్లు సాధిస్తుంది? బీజేపీ బలం రెండు నుంచి 15 సీట్లకు దాటుతుందా.... అనే కీలక అంశాలుండటంతో బెంగాల్‌ ఎన్నికలపై  రాజకీయవర్గాల్లో వాడీవేడి చర్చ సాగుతోంది.

పదిహేడో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ  పశ్చిమ బెంగాల్‌లోని 42 సీట్లలో 15 నుంచి 22 స్థానాలు కైవసం చేసుకుంటే దేశ తూర్పు ప్రాంతంలో కూడా బలమైన శక్తిగా అవతరించడానికి వీలవుతుంది.  కిందటి లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర, మధ్య, పశ్చిమ రాష్ట్రాల్లో కాషాయపక్షం అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. హిందీ రాష్ట్రాల్లోని 225 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 190 గెలుచుకుంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఒకవేళ ఈ ప్రాంతాల్లో తనకు తగ్గే సీట్లను పశ్చిమ బెంగాల్, ఒడిశాలో భర్తీ చేసుకోవాలనే పట్టుదలతో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పకడ్బందీ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ముస్లింలు 27 శాతానికి పైగా ఉండడం, 2009 లోక్‌సభ ఎన్నికల నుంచీ సీపీఎం నేతృత్వంలోని వామపక్షాలు ఎన్నికల్లో చతికిలపడడం, మరో పక్క అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ఈ మధ్య బలహీనం కావడం బీజేపీకి ఇప్పుడు కలిసొచ్చే అంశాలయ్యాయి. కిందటి ఎన్నికల్లో మోదీ గాలిలో సైతం బీజేపీ కేవలం రెండు సీట్లనే బెంగాల్‌లో గెలుచుకోగలిగింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలం పెరగకపోయినా కమ్యూనిస్ట్‌ పార్టీల పునాదులు మరింత కదిలిపోయాయి. బెంగాల్‌ బెబ్బులి దీదీ మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని 34 ఏళ్లు ఏలిన మార్క్సిస్టుల బాటలోనే పయనిస్తూ ప్రతిపక్షాలను ప్రధానంగా వామపక్షాల ఉనికిని బాగా దెబ్బతీస్తోంది. తృణమూల్‌ పాలనలో మార్క్సిస్టుల స్థానంలోకి నెమ్మదిగా బీజేపీ చేరుకోగలిగింది. మమత సర్కారును, తృణమూల్‌ కాంగ్రెస్‌ పోకడలను ఢీకొనే స్థితికి బీజేపీ చేరుకోవడంతో లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా అత్యధిక సీట్లు కైవసం చేసుకోవాలన్న పట్టుదల మోదీ–షా ద్వయంలో పెరిగింది.

మోదీ, మమతా హోరాహోరీ ప్రచారం
మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోదీ, అమిత్‌ షా ఉధృత స్థాయిలో ప్రచారం చేశారు. మమతపైన వ్యక్తిగత స్థాయిలో వారు తీవ్ర ఆరోపణలు చేశారు. మమత సైతం అంతే దీటుగా బీజేపీ విమర్శలకు జవాబిచ్చారు. పూర్వపు వామపక్షాల సర్కార్ల కంటే ఎక్కువగా మమత ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగోవంతుకుపైగా జనాభా ఉన్న ముస్లింలను బుజ్జగించే విధానాలు అమలు చేస్తోందనీ, పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ వలసదారులను అనుమతిస్తోందంటూ బీజేపీ నిప్పులు చెరుగుతోంది. గతంలో జరిగిన శారద, నారద కుంభకోణాల గురించి ప్రస్తావిస్తూ తృణమూల్‌ సర్కారును ఇరుకున పెడుతోంది. అయినా, బీజేపీ ఆర్థికబలం, అంగబలం తృణమూల్‌కు సమానంగా ఉంటాయని మమత ఊహించలేదు. తృణమూల్‌ నేతలు, కార్యకర్తల దూకుడు ముందు నిలబడలేక పోతున్న సీపీఎం ఒక దశలో తన ఉనికి కాపాడుకోవడానికి బీజేపీకి పరోక్షంగా సాయపడింది. కొన్ని వారాల క్రితం మాల్దాలో అమిత్‌షా బహిరంగ సభను ప్రభుత్వ మైదానంలో జరుపుకోవడానికి మమతా బెనర్జీ సర్కారు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడంతో సీపీఎం సీనియర్‌ నేత ఒకరు తన సొంత స్థలాన్ని బీజేపీ నేత సభకు అద్దెకు ఇచ్చారని కూడా వార్తలొచ్చాయి. 

ఉత్తర బెంగాల్, బంగ్లాదేశ్‌ సరిహద్దు జిల్లాల్లో బలపడుతున్న బీజేపీ
ఉత్తర బెంగాల్, బంగ్లాదేశ్‌ సరిహద్దు జిల్లాల్లో బీజేపీ బలపడుతోందని ఈ పార్టీ ఎన్నికల సభలకు హాజరయ్యే జనం, ఎన్నికల ప్రచారం తీరు చూస్తే అర్థమౌతోంది. ఉత్తర బెంగాల్‌లో కమ్యూనిస్టులు ఊహించని స్థాయిలో పట్టు కోల్పోయారు. ఫలితంగా పాలకపక్షాన్ని ధైర్యంగా ప్రతిఘటించే అవకాశం బీజేపీకి లభించింది. సరిహద్దు జిల్లాల్లో ముస్లింల జనాభాతోపాటు ప్రజల్లో మతపరమైన చీలిక ఉండడం కూడా బీజేపీ ఈ ప్రాంతాల్లో తన పునాదులు బలోపేతం చేసుకోవడానికి దోహదం చేసింది. బీజేపీ కేంద్ర నాయకత్వం బెంగాల్‌పై ఎప్పుడూ లేనంతగా దృష్టి కేంద్రీకరించింది. మొదటి ఐదు దశల పోలింగ్‌ సమయంలోనూ తృణమూల్‌ నేతలు, కార్యకర్తలతో బీజేపీ ఢీ అంటే ఢీ అనేలా పోటీపడింది. ఎనిమిదేళ్లుగా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారంలో ఉండడం వల్ల కొన్ని రంగాల్లో సాధించిన విజయాలతో కొన్ని చోట్ల బాగా బలపడింది. కొన్ని రంగాల్లో దీదీ సర్కారు విధానాల వల్ల కొన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నాయి.

పెరుగుతున్న బీజేపీ బలం
పశ్చిమబెంగాల్‌లో గతంలో కమ్యూనిస్టుల ప్రాబల్యంలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలన్నింటిలో ఈసారి బీజేపీ పట్టుబిగిస్తోంది. 2014 ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని అంచనా వేసినా ఈసారి బీజేపీకి ఓట్ల శాతం పెరుగుతుందని నిపుణులు తేల్చి చెపుతున్నారు. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను డేటాని బట్టి చూసినా కామ్రేడ్ల స్థానంలో కాషాయం ఆక్రమిస్తున్న విషయం దృఢపడుతోంది. బీజేపీ ఓట్ల శాతం 2014లో 16.8 శాతం ఉంటే అది ఈ ఎన్నికల్లో 23.32 శాతానికి పెరగవచ్చునని భావిస్తున్నారు. అలాగే బీజేపీ సీట్ల శాతం కూడా గణనీయంగా పెరిగే అవకాశాన్ని సర్వేలు నొక్కి చెపుతున్నాయి. దాదాపు 12.7 శాతం ఓట్లు బీజేపీకి పెరగొచ్చని భావిస్తున్నారు.     ఈ నెల 12, 19 తేదీల్లో జరిగే చివరి రెండు దశల ఎన్నికలను తృణమూల్‌ కాంగ్రెస్‌ అత్యంత కీలకంగా భావిస్తోంది. ఆరో దశలో పోలింగ్‌ కనీసం నాలుగు నియోజకవర్గాల్లో ఆదివాసీలదే అధిక జనాభా కావడంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ వాటిని ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. చివరి రెండు దశల్లో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఆరోదశలో జరిగే 8 స్థానాల్లో నాలుగింటిలో ఆదివాసీలదే కీలక భూమిక.

సరిహద్దు స్థానాల్లో గట్టి పోటీ
మావోయిస్టుల ప్రాబల్యం కలిగిన జార్ఖండ్‌ సరిహద్దుల్లోని మూడు జిల్లాల పరిధిలో విస్తరించిన ప్రాంతాన్ని జంగిల్‌ మహల్‌ గా పిలుస్తారు. ఒకప్పుడు ఇక్కడ సీపీఎం ప్రభావవంతమైన పాత్ర నిర్వహించింది. ప్రస్తుతం ఉనికిని కోల్పోయిన పరిస్థితి.ఈ ప్రాంతంలోని స్థానాల్లో పోటీ బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ల మధ్యే ఉంది. 2014లో తృణమూల్‌కి అత్యధికంగా 54 శాతం ఓట్లను తెచ్చిపెట్టిన స్థానం ఝర్‌గ్రామే. 42ఏళ్ళపాటు సుదీర్ఘకాలం కమ్యూనిస్టుల పట్టులోనుంచి 2014 ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి పులిన్‌ బిహారీ బాస్కే నుంచి ఈ లోక్‌సభ స్థానాన్ని తృణమూల్‌ ఉమాసోరెన్‌  కైవసం చేసుకున్నారు. ఈసారి సీపీఎం అభ్యర్థి దెబ్లీనా హెమ్‌బ్రామ్‌పై తృణమూల్‌ కాంగ్రెస్‌ బీర్భా సోరెన్‌ను బరిలోకి దింపింది. బీజేపీ నుంచి ఇక్కడ కునార్‌ హెమ్‌బ్రం పోటీ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో మమత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనీ, ప్రజలు మార్పుని కోరుకుంటున్నారనీ విశ్లేషకుల అంచనా. అందుకే మావోయిస్టు ప్రాబల్యంలోని ఈ ప్రాంతాన్ని తమ అదుపులోకి తెచ్చుకునేందుకు మమతా బెనర్జీ నగదు పంపిణీ పథకాలు, ఆదివాసీలకు 2 కిలోల బియ్యం లాంటి పథకాలను ప్రవేశ పెట్టింది. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే బీజేపీ వాసనలే లేని ఈ ప్రాంతంలో ప్రస్తుతం బీజేపీ తన బలం పెంచుకుంటోందనడానికి ఇక్కడి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నాయి. చివరి దశలో పశ్చిమబెంగాల్‌లో జరిగే ఎన్నికల్లో తృణమూల్‌కి కీలకస్థానంగా మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ పోటీచేస్తోన్న స్థానం డైమండ్‌ హార్బర్‌. ఇక్కడ బీజేపీ తరఫున నీలంజన్‌ రాయ్, సీపీఎం నుంచి ఫౌద్‌ హలీమ్‌ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన అభిషేక్‌ బెనర్జీ మళ్లీ బరిలో నిలిచారు. కమ్యూనిస్టులకు పెట్టని కోటలాంటి జాదవ్‌పూర్‌లో ఈసారి టాలీవుడ్‌ సినీతార మీమీ చక్రవర్తిని తృణమూల్‌ కాంగ్రెస్‌ బరిలోకి దింపింది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో సీపీఎంకి పట్టు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థిగా కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ మాజీ మేయర్‌ బికాష్‌ రంజన్‌ భట్టాచార్యను బరిలోకి దింపారు. బీజేపీ నుంచి అనుపమ్‌ హజ్రా బరిలో ఉన్నారు.

ఆరో దశ
పోలింగ్‌ జరిగే ప్రాంతాలు

తామ్‌లుక్, కాంతి, ఘాటల్, ఝర్‌గ్రామ్, మేద్‌నీపూర్, పురూలియా, బంకూరా, బిష్ణూపూర్‌

చివరి దశ
డమ్‌డమ్, బారాసాత్, బసిర్‌హాట్, జయనగర్, మథురాపూర్, డైమండ్‌ హార్బర్, జాదవ్‌పూర్, దక్షిణ కోల్‌కతా,
ఉత్తర కోల్‌కతా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement