లక్నో : అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం పార్లమెంట్‌లో బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక బిల్లును ప్రవేశపెడుతుందని ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించారు. రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేకపోవడం మూలంగా బిల్లు పెట్టడం లేదని, రాజ్యసభలో పూర్తి స్థాయి మెజార్టీ సాధించిన వెంటనే బిల్లును ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. లక్నోలో ఆదివారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ రామ మందిర నిర్మాణం కోరకు మేం కట్టుబడి ఉన్నాం. ప్రస్తుతం లోక్‌సభలో పూర్తి మెజార్టీ ఉంది. కానీ బిల్లు ఆమోదం పొందడానికి రాజ్యసభలో తగిన మద్దతు లేదు’’. అని పేర్కొన్నారు.
మౌర్యా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ఒకవేళ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందినా.. రాజ్యసభలో అది వీగిపోతుంది. ఈ విషయం ప్రతీ రాముడి భక్తుడికి తెలుసు. త్వరలో దీనిపై సుప్రీంకోర్టు తీర్పును కూడా వెలువరిస్తుంది’’ అని పేర్కొన్నారు. కాగా రామ మందిర నిర్మాణంపై గతకొంత కాలం నుంచి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు వరస ప్రకటన వెలువరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, ఆరెస్సెస్ అధినేత మోహన్ భగత్ సందర్శించి, రామమందిరం నిర్మాణం తప్పకుండా చేపడతామని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment