
సాక్షి, చెన్నై: తమిళనాడులో సమూలమైన మార్పులు తీసుకువస్తానని ఉత్సాహంగా ముందుకు వచ్చిన సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఆదిలోనే కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. సభ్యులుగా చేరేందుకు ఆయన ప్రారంభించిన వెబ్‌సైట్లకు అదనంగా బోగస్ వెబ్‌సైట్లు ఇంటర్నెట్‌లో దర్శనమివ్వడం రజనీ అభిమానుల్లో ఆందోళనను పెంచుతోంది. ఈ క్రమంలో రజనీకాంత్ పేరుతో అభిమాన సంఘాలు కొత్త వాట్సాప్ గ్రూపును గురువారం ప్రారంభించాయి. గత ఏడాది మే నెలలో ఐదురోజులు, డిసెంబరులో ఆరురోజులపాటూ అభిమానులను కలుసుకున్న రజనీకాంత్ గతేడాది చివరిరోజైన డిసెంబర్ 31న వేలాది మంది అభిమానుల సమక్షంలో ‘అరసియల్‌కు వరుదు ఉరుది’ (రాజకీయాల్లోకి రావడం ఖాయం) అంటూ ప్రకటించి హర్షధ్వానాలు అందుకున్నారు.
తాను స్థాపించబోయే పార్టీలో చేరదలుచుకున్న వారు, వ్యవస్థలో మార్పును కోరుకునేవారు తమ వెబ్‌సైట్ ద్వారా పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా రజనీకాంత్ మరుసటి రోజున పిలుపునిచ్చారు. ఈ మేరకు www.rajinimandram.org అనే వెబ్‌సైట్‌ను ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ వెబ్‌సైట్ ద్వారా సుమారు 50 లక్షల మంది సభ్యులుగా చేరినట్లు తెలుస్తోంది. ఇంకా చాలా మంది సభ్యత్వం కోసం తహతహలాడుతున్నారు. ఇదిలా ఉండగా రజనీ పేరుతో మూడు బోగస్ వెబ్‌సైట్లు కూడా ప్రారంభం కావడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. తలైవర్ మన్రం, రజనీ మంత్రం, కేస్ తమిళనాడు పేరుతో భోగస్ వెబ్‌సైట్లు దర్శనమిస్తున్నాయి.
బోగస్ వెబ్‌సైట్లు అసలైన అభిమానులను, రజనీ మద్ధతుదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగా ప్రజలను, అభిమానులను నేరుగా కలుసుకుని దరఖాస్తు పత్రాల ద్వారా సభ్యత్వ నమోదు చేయడం మంచిదని సంఘాల నేతలు ఆలోచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 వేల రిజిష్ట్రర్డు, 30వేల రిజిష్టరు కాని అభిమాన సంఘాలు లెక్కన మొత్తం 50 వేలు ఉన్నాయి. ఈ అభిమాన సంఘాల ద్వారా సభ్యత్వం నమోదు చేయాలని భావిస్తున్నారు. కాగా, రజనీకాంత్ పేరుతో అభిమాన సంఘాలు కొత్త వాట్సాప్ గ్రూపును గురువారం ప్రారంభించాయి.
ఆర్‌ఎమ్ వీరప్పన్‌తో భేటీ
పార్టీ పెట్టే ముందు రాజకీయ పెద్దలను కలుసుకునే పనిలో ఉన్న రజనీకాంత్ గురువారం మాజీ మంత్రి, ఎంజీఆర్ కళగ అధ్యక్షులు ఆర్‌ఎమ్ వీరప్పన్‌తో రజనీ భేటీ అయ్యారు. తనతో భాషా వంటి సూపర్‌హిట్ మూవీ నిర్మించిన వీరప్పన్‌ను చెన్నై వళ్లువర్‌కోట్టంలోని ఆయన ఇంటికి వెళ్లి కలుసుకున్న రజనీ ఆయనతో సుమారు గంటపాటూ ముచ్చటించారు. మలేషియాలో జరిగే సినిమా ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు గురువారం రజనీకాంత్ మలేషియా వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment