
సాక్షి, విజయవాడ : ఏపీలో కలకలం రేపిన ఓటర్ల సర్వే వ్యవహారం.. వైఎస్‌ఆర్‌సీపీ నేతల అక్రమ అరెస్ట్‌లపై.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈసీ, డీజీపీని కలిశారు. సర్వే చేయడానికి వచ్చిన వ్యక్తుల నుంచి సేకరించిన ట్యాబ్‌లను డీజీపీకి అందజేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీని కలిసిన వారిలో వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పార్థసారధి, మల్లాది విష్ణు ఉన్నారు. ఓటమి భయంతోనే ప్రభుత్వ పెద్దలు ఇలాంటి దొంగచాటు చర్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో టీడీపీ వ్యతిరేక ఓట్ల తొలగింపు కోసం జరుగుతున్న కుట్ర సర్వే గురించి ఈసీకి, డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. సర్వేల పేరుతో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితాను ట్యాబుల్లో అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. నెల్లిమర్లలో సర్వే చేయడానికి వచ్చిన వ్యక్తులు తాము ప్రభుత్వం తరఫున వచ్చామని చెప్పుకున్నారన్నారు.
అనుమానం వచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వీరిని పట్టుకుని ట్యాబులను స్థానిక పోలీసులకు అప్పజెప్పారని తెలిపారు. అయితే, పోలీసులు ఆ మనుషులను వదిలేసి.. ట్యాబులు తీసుకెళ్లి ఫిర్యాదు చేసుకొమ్మని తమ పార్టీ కార్యకర్తలకు చెప్పారని పేర్కొన్నారు. రెండు ట్యాబులను ఎన్నికల సంఘానికి ఇచ్చామన్నారు. సర్వే చేయడానికి వచ్చిన వారు ఏ పార్టీ అనే విషయాన్ని ఆరా తీయరని స్పష్టం చేశారు. వీటికి తోడు అక్రమ అరెస్టులతో తమ కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తున్నారంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈసీ ఇలాంటి సర్వేలు చేయించదు : గోపాల కృష్ణ ద్వివేది
సర్వే గురించి వైఎస్సార్‌సీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. ట్యాబ్‌లు ఇచ్చి ప్రైవేట్ వ్యక్తులను పంపి సర్వే చేయించడం వంటి పనులు ఈసీ చేయదని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాపై ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చాయని.. వీటన్నింటిని పరిష్కరించాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఆదేశించామన్నారు. నామినేష్ల చివరి రోజు వరకూ కూడా ఓటర్ల నమోదు, మార్పులు చేసుకోవచ్చిని తెలిపారు.