బౌన్సర్లు.. ఒకప్పుడు బార్ వద్ద కనిపించేవారు.. ఎన్నికల పుణ్యమాని ఇప్పుడు ప్రతిచోటా కనిపిస్తున్నారు. ఆశావహుల అసంతృప్తి, నిరసనల నేపథ్యంలో భద్రత కోసం ఇప్పుడు పార్టీ కార్యాలయాలు, నేతల వద్ద వీళ్లే దర్శనమిస్తున్నారు. గాంధీ భవన్ వద్ద అయితే పోలీసుల కంటే రెట్టింపు సంఖ్యలో బౌన్సర్లను మోహరించిన విషయం తెలిసిందే. నగరవ్యాప్తంగా పలువురు అభ్యర్థులు, ఛోటామోటా నేతల వెంట తిరగడానికి ఇతర ప్రాంతాల నుంచీ బౌన్సర్లు ‘దిగుమతి’ అవుతున్నారు. అయితే, బౌన్సర్ల కారణంగా స్థానికంగా ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు వారిపై ఓ కన్నేసి ఉంచుతున్నారు.
సాక్షి, హైదరాబాద్
బౌన్సర్... ఈ పేరు పబ్బులు, బార్‌లకు వెళ్లేవారికి సుపరిచితమే. మితిమీరి ప్రవర్తించేవారిని, హద్దు మీరి మద్యం సేవించి గొడవలు చేసేవారిని కట్టడి చేయడానికి శాశ్వత ప్రాతిపదికన యాజమాన్యాలు ఈ బౌన్సర్లను నియమించుకుంటాయి. కండలు తిరిగిన శరీరం, చిరునవ్వు కూడా కనిపించని ముఖం, నల్లటి యూనిఫాం(సాధారణంగా టీ–షర్ట్, జీన్స్)లో వీరు కనిపిస్తుంటారు. ఎన్నికల నేపథ్యంలో వారి వస్త్రాలు నలుపు డ్రస్ నుంచి సఫారీకో, ఖద్దరుకో మారుతున్నాయి. కొందరు బాడీ బిల్డర్లయితే ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వీరికి రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు ‘జీతం’లభిస్తోందని తెలిసింది.
గన్‌మెన్ ముచ్చట తీరుతోంది...
ఈ బౌన్సర్లను సఫారీ దుస్తుల్లో తమ వెంట తిప్పుకుంటున్న నాయకులు గన్‌మెన్ ముచ్చట తీర్చుకుంటున్నారు. సాధారణంగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులకు పోలీసు విభాగం వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కేటాయిస్తుంది. మిగిలినవారికి, అభ్యర్థుల వెంట ఉండే కీలక వ్యక్తులకు, స్వతంత్రులుగా పోటీ పడేవారికి ఆ అవకాశం లేకపోవడంతో వారంతా బౌన్సర్లను సమకూర్చుకుంటున్నారు. బౌన్సర్లను ఏర్పాటు చేయడానికి నగరంలో అనేక సెక్యూరిటీ ఏజెన్సీలతోపాటు జిమ్‌లు సైతం సిద్ధంగా ఉన్నాయి.
కరుకుదనం తగ్గితే చాలంటూ...
దేహదారుఢ్యంతోపాటు కాస్త చురుకుదనం, సమయస్ఫూర్తి మాత్రమే ప్రధాన అర్హతలు కావడంతో జిమ్స్‌తో టచ్‌లో ఉండే అనేకమంది యువకులు తాత్కాలిక బౌన్సర్లుగా ఉండటానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే, ప్రచారం నేపథ్యంలో ఎక్కడా కరుకుదనం ప్రదర్శించవద్దని ఆయా నేతలు ముందే వారికి షరతు విధిస్తున్నారు. పోలింగ్‌కు ముందు మూడు రోజులు ప్రతి అభ్యర్థికీ కీలకమైనవి. ఆ సమయంలో ఈ బౌన్సర్లకు గిరాకీ మరింత పెరగనుంది. మరోపక్క పోలీసులు సైతం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కొత్తవారి కదలికలపై కన్నేసి ఉంచుతున్నారు. నాయకుల వెంట ఉన్నవారిలో నిజమైన అనుచరులు ఎవరు? బౌన్సర్లు ఎవరు? ప్రచారం నేపథ్యంలో వారు ఏం చేస్తున్నారు? తదితర అంశాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు. ఎవరి ఆగడాలు శృతిమించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తున్నారు.
ఉత్తమ్ ఇంటివద్ద బౌన్సర్లు
మహాకూటమిలో అసంతృప్త జ్వాల
రగులుతుండగా ఏ క్షణంలో ఎవరొచ్చి మీదపడతారో తెలియని పరిస్థితుల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి బంజారాహిల్స్‌లోని తన నివాసం వద్ద 25 మంది బౌన్సర్లను నియమించారు. మంగళవారంరాత్రి నుంచే వీరంతా ఇంటి చుట్టూ కాపలాగా ఉన్నారు. పొత్తుల్లో సీట్లు కోల్పోయిన నేతలంతా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఇంటి ముట్టడికి యత్నిస్తున్నారన్న నిఘావర్గాల హెచ్చరికలతో ఆయన ఇంటి వద్ద ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిరసనలపై బౌన్సర్!
Published Fri, Nov 16 2018 4:39 AM | Last Updated on Fri, Mar 22 2019 6:24 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment